Vijay Devarakonda | యూత్‌లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ సామాన్యమైనదికాదు. సినిమాల ప్రతికూల ఫలితాలు కూడా ఆయన ఇమేజ్‌పై ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘జెర్సీ’ఫేం గౌతమ్ తిన్ననూరి సినిమా. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ పాత్ర విభిన్నంగా, భావోద్వేగపూరితంగా ఉంటుందని తెలుస్తున్నది. అలాగే.. ‘రాజావారు రాణిగారు’ ఫేం రవికిరణ్ కోల దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయనున్నారట విజయ్ దేవరకొండ. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా రూపొందనుందని సమాచారం.
ఇక మూడోది రాహుల్ సంకృత్యన్ సినిమా. విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్.. ఆ తర్వాత నానితో ‘శ్యాంమ్సింగరాయ్’ సినిమా చేశారు. రెండూ హిట్లే. ఇప్పుడు మూడో సినిమా విజయ్ దేవరకొండతో చేయనున్నారాయన. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్, అనంతపూర్, కడప జిల్లాల్లోని కొన్ని అరుదైన లొకేషన్స్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఇందులో మునుపెన్నడూ కనిపించని విధంగా, స్టన్నింగ్ లుక్‌తో విజయ్ కనిపిస్తారని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ అభిమానులు పండుగ చేసుకునేలా ఆయన కేరక్టరైజేషన్ ఉంటుందట. మొత్తంగా ముగ్గురు వైవిధ్యమైన దర్శకులతో విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ విజయ్ దేవరకొండ బిజీబిజీగా ఉన్నారు.