Vijay Devarakonda Bithday Special | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలను సైతం తన నటనకు జోహార్లు కొట్టేలా చేసాడు విజయ్ దేవరకొండ. సినీరంగంలో హీరోగా ఎంట్రీ అనేది చాలా కష్టం. ఇక హీరోగా అవకాశం వచ్చినా అది నిలబెట్టుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆ శ్రమనే ఆయుధంగా వాడుకొని విజయ్ టాలీవుడ్ టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. అప్పట్లో చిరంజీవి, రవితేజ, నాని వంటి నటులు ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరాన్ని ఎలా అదిరోహించారనేది విన్నాం. కానీ ఇప్పుడు విజయ్ చూసాం. ఒక స్టేజ్‌లో విజయ్ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చెయ్యడంలేదని అకౌంట్‌ని నిలిపి వేశారు. అలాంటి స్టేజ్ నుంచి ఈ స్థాయికి వచ్చాడంటే మాములు విషయం కాదు. ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్టేజ్‌కి వచ్చాడు. ఇక ఈయనకు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్లో పలువురు హీరోయిన్లు విజయ్ అంటే ఇష్టమని, తనతో కలిసి పనిచేయాలనుందని మనసులో మాటలను తెలిపారు. ప్రస్తుతం విజయ్ సినిమాలకు స్టార్ హీరో సినిమాలకున్న క్రేజ్ ఉంది.
జననం:
విజయ్ దేవరకొండ 1989 మే 9న హైదరాబాద్‌లో జన్మించాడు. టెన్త్ వరకు పుట్టపర్తి సత్య సాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. డిగ్రీ పూర్తవ్వగానే విజయ్ యాక్టర్ అవ్వాలని ఉందని వాళ్ళ నాన్నతో చెప్పాడు. దానికి విజయ్ తండ్రి యాక్టింగ్ స్కూల్లో చేర్పించాడు. అయితే విజయ్ తండ్రి కూడా ఇండస్ట్రీకి నటుడవుదామని వచ్చి అంతగా అవకాశాలు రాక దూరదర్శన్ సీరియల్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. విజయ్ యాక్టింగ్ నేర్చుకుని థియేటర్ ఆర్టిస్టుగా పనిచేశాడు.
మొదటి అవకాశం:
ఆ సమయంలోనే రవిబాబు ‘నువ్విలా’ సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నాడని తెలుసుకుని, విజయ్ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాడు. విజయ్ ఈ చిత్రంలో విష్ణు అనే క్రికెటర్ క్యారెక్టర్లో నటించాడు. కానీ ఈ చిత్రంలో విజయ్ పాత్రకు అంతగా స్కోప్ ఉండదు. దాంతో ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు ఏమాత్రం దోహదపడలేదు. ఆ తరువాత శేఖర్ కమ్ములా దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రం కూడా విజయ్‌కు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఈ చిత్రంలో నాగ్అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసాడు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. దాంతో నాగ్ అశ్విన్ వైజయంతీ బ్యానర్లో ‘ఎవడే సుబ్రమణ్యం’ చేస్తున్నాడు. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలకపాత్ర కోసం విజయ్ అయితే సెట్ అవుతాడని భావించి నాగ్ అశ్విన్, విజయ్ను పిలిచి స్క్రిప్ట్ చెప్పాడట. విజయ్ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత అసలు సైడ్ క్యారెక్టర్స్ చెయ్యోద్దని ఫిక్స్ అయ్యాడట. అయితే నాగ్ చెప్పిన క్యారెక్టర్ నచ్చి వెంటనే ఒప్పుకున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు మంచి బ్రేక్ తీసుకోచ్చింది. దాంతో విజయ్‌కు అవకశాలు బాగానే వచ్చాయి. కానీ విజయ్ మాత్రం మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూసాడు.
మొదటి హిట్:
ఆ సమయంలో తరణ్భాస్కర్ ‘పెళ్ళి చూపులు’ సినిమాకోసం హీరోలను వెతుకుతున్నాడు. అప్పుడే ఎవడే సుబ్రమణ్యం సినిమా చూసి విజయ్ను సెలక్ట్ చేశాడట. ఈ చిత్రం విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రశాంత్ క్యారెక్టర్లో విజయ్ మంచి నటనను కనబరిచాడు. ఈ చిత్రం విజయ్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. తన మొదటి సినిమాతోనే కమర్షియల్ సక్సెస్‌ను సాధించాడు. ఈ చిత్రం తర్వాత ‘ద్వారక’ అనే సినిమాను చేశాడు. కానీ ఈ చిత్రం అంతగా ఆడలేదు.
బెస్ట్ యాక్టర్ అవార్డు:
‘ద్వారక’ సినిమా తర్వాత విజయ్ దగ్గరకు కథలు వస్తున్నాయి కాని అంతగా స్కోప్ ఉన్న క్యారెక్టర్లు రావడంలేదు. ఆ సమయంలోనే సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్నాడు. పలువురు స్టార్లకు ఈ కథ చెప్పగా, ఆ స్టార్లు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అర్జున్ రెడ్డి స్ట్రిప్ట్‌ను రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలో వైజయంతి సంస్థ నిర్వాహకులైన స్వప్న దత్, విజయ్ గురించి చెప్పిందట. తినే ప్రతి అన్నం మెతుకు మీద మన పేరు రాసుండాలి అంటుంటారు.. అదే విధంగా హీరోల విషయంలో చేసే సినిమాలపై వారి పేరు రాసుండాలి అంటుంటారు. ఈ విధంగా ఎంతో మంది స్టార్ హీరోల దగ్గరకు వెళ్ళిన కథ చివరికి విజయ్ దగ్గరకు వచ్చి చేరింది. కరెక్టుగా యూస్ చేసుకునే దర్శకుడు ఉంటే హీరో ఎలాంటి అవుట్ పుట్ ఇవ్వగలడో అర్జున్ రెడ్డి సినిమా నిరూపించింది. 2017 ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. విజయ్ నటన, ఆటీట్యూడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. కల్ట్ క్లాసిక్ మోడ్రన్ దేవదాసు అంటూ సినిమాకు ట్యాగ్ ఇచ్చేశారు. ఈ చిత్రంతో విజయ్ రేంజ్ అమాంతం పెరిగింది. అప్పటివరకు పలువురు స్టార్లకు కూడా రాని ఫిలింఫేర్ అవార్డు విజయ్‌కు ఈ చిత్రంతో వచ్చింది.
మొదటి 100కోట్ల క్లబ్:
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ మీద ప్రేక్షకులలో విపరీతమైన అభిమానం పెరిగింది. యూత్‌లో ఒక రేంజ్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో తన తరువాతి సినిమాలపై ప్రేక్షకులలో భారీ ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే విజయ్ అర్జున్ రెడ్డి తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడో అని ప్రేక్షకులలో ఆసక్తిని ఏర్పడింది. మరో అగ్రెసీవ్ క్యారెక్టర్‌తో వస్తాడా లేదా మాస్ సినిమాతో వస్తాడా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ విజయ్ ‘గీతా గోవిందం’తో అందిరిని సర్ప్రైజ్ చేశాడు. అర్జున్‌రెడ్డి లాంటి వైలెంట్ చిత్రం తర్వాత గీతా గోవిందం లాంటి సాఫ్ట్ సినిమా రావడం విజయ్ నుంచి అస్సలు ఎవరూ ఊహించలేరు. ఈ చిత్రంలో విజయ్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. తన స్క్రిప్ట్ సెలక్షన్‌కు స్టార్ హీరోల సైతం మెచ్చుకున్నారు. అర్జున్ లాంటి అగ్రెసీవ్ క్యారెక్టర్ తర్వాత విజయ్ గోవింద్ లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం ప్రేక్షకులకు తెగ నచ్చింది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌ను ఏకంగా 10 మెట్లు ఎక్కించింది. ఈ చిత్రంతో విజయ్ 100కోట్ల క్లబ్లో అడుగుపెట్టి స్టార్ హీరోలను సైతం ఆశ్యర్యంలో పెట్టాడు. అప్పటివరకు నలుగురు, ఐదుగురు మాత్రమే 100కోట్ల క్లబ్లో అడుగుపెట్టారు. నిర్మాతలకు ఈ చిత్రం 4రేట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
గీతా గోవిందంతో విజయ్ స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ‘నోటా’ అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ద్విభాషా చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీని తర్వాత రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ‘టాక్సీవాలా’ అనే సినిమాను చేశాడు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే సినిమా మొత్తం అంటే 3గంటల లీకైంది. ఆ సమయంలో సినిమాను విడుదల చేద్దామా వద్దా అని నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. విడుదల చేస్తే ప్రమోషన్ల ఖర్చులైనా వస్తాయా? అనే విధంగా ఆలోచించారు. కానీ విజయ్, నిర్మాతలకు ధైర్యం చెప్పి సినిమాను విడుదల చేయమన్నాడు.
దాంతో నిర్మాతలు ‘టాక్సీవాలా’ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదలైన మొదటి షో నుంచి పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజే ఈ చిత్రం రూ.10కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర విజయ్ స్టామినా ఎంటో తెలిసేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమల్ లవర్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవువడం విజయ్ను కొంత నిరుత్సాహ పరిచాయి. కానీ ఈ రెండు చిత్రాలు విజయ్ కెరీర్‌ను ఏ మాత్రం డిస్ట్రాయ్ చేయ్యలేవని ఇటీవలే ‘లైగర్’కు జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ తెలియజేస్తుంది.
పాన్ ఇండియా సినిమా:
రెండు వరుస ఫ్లాప్‌ల తర్వాత విజయ్‌కు పూరి గ్యారేజ్నుంచి పిలుపువచ్చింది. మాములుగా పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోలకు ఆటీట్యూడ్, స్వాగ్, సెల్ఫ్ ట్రస్ట్ ఉంటుంది. అలాంటిది విజయ్‌కు ముందునుండే అవన్ని ఉన్నాయి. అలాంటిది పూరి, విజయ్ను ఏ రేంజ్లో చూపిస్తాడో అని విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, మేకింగ్ గ్లింప్స్ వంటివి విజయ్‌లో మరో కోణాన్ని తెలియజేస్తున్నాయి. ఈ చిత్రం విజయ్‌కు మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. విజయ్ కెరీర్‌ను మార్చిన ‘అర్జున్ రెడ్డి’ కూడా అదే తేదీన విడుదలైంది. ‘లైగర్’ కూడా అదే రోజున విడుదలవుతుండటంతో ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ కన్ఫార్మ్ అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం విజయ్, శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్‌స్టోరిని చేస్తున్నాడు. కాశ్మీర్ ప్రాంతంలో సాగే లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. మణిరత్నం రోజా తరహాలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తుంది. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం కాశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం తర్వాత విజయ్ పూరితో మరోసారి జనగణమన సినిమాను చేయనున్నాడు. ఈ చిత్రంలో ఆర్మీ అధికారిగా నటించనున్నాడు.