Jana Nayagan | మలేషియా వేదికగా జరిగిన ‘జననాయగన్’ (Jana Nayagan) ఆడియో లాంచ్ ఈవెంట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో, కౌలాలంపూర్‌లో జరిగిన ఈ వేడుక కేవలం సినిమా ఈవెంట్‌లా కాకుండా ఒక అంతర్జాతీయ పండుగలా మారింది. మలేషియా రాజధానిలోని ఐకానిక్ ‘బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియం’ 80,000 మందివిజయ్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. సరిహద్దులు దాటిన విజయ్ క్రేజ్‌ను చూసి అంతర్జాతీయ మీడియా సైతం ఆశ్చర్యపోయింది. అనిరుధ్ రవిచందర్ తన సంగీతంతో స్టేడియాన్ని హోరెత్తించగా అనూహ్యంగా విజయ్ వేదికపైకి వచ్చి డ్యాన్స్ చేయడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.
ఈ చిత్రంలోని పక్కా మాస్ సాంగ్ ‘తలపతి కచేరీ’కి విజయ్ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట మారుమోగుతున్నాయి. 51 ఏళ్ల వయసులో కూడా తన సిగ్నేచర్ గ్రేస్ మరియు ఎనర్జీతో విజయ్ చేసిన డ్యాన్స్ వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి. తన ఆఖరి సినిమాలో అభిమానులకు మర్చిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నారని ఈ డ్యాన్స్ చూస్తే అర్థమవుతోంది. మలేషియా ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా ఈ వేడుకలో రాజకీయ ప్రసంగాలకు అనుమతి లేదు. అయితే, అభిమానులు భారీ ఎత్తున ‘TVK’ (తమిళగ వెట్రి కళగం) జెండాలు ఊపుతూ నినాదాలు చేయగా, విజయ్ ఎంతో హుందాతనంతో వారిని వారించారు. కేవలం సినిమాను మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలని సూచించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ ఈవెంట్లో సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్లు అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లతో పాటు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కూడా పాల్గొన్నారు. వీరంతా విజయ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ, ఆయన రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ONE LAST DANCE. pic.twitter.com/kqYwM4yFA5
— LetsCinema (@letscinema) December 27, 2025