Vijay Antony | తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా తన మేనల్లుడు అజయ్ ధీషన్‌ను వెండితెరకు పరిచయం చేశారు. సముద్రఖని, బ్రిగిడ్, దీప్షికా, మహానతి శంకర్, వినోద్ సాగర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నగరంలో రమ్య అనే యువతి దారుణంగా హత్యకు గురవుతుంది. ఆమె శరీరం ఓ విచిత్రమైన ఇంజెక్షన్ కారణంగా నల్లగా మారి ప్రాణాలు కోల్పోతుంది. ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యత పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ)కు అప్పగిస్తారు పోలీస్ అధికారులు. అయితే సరిగ్గా తొమ్మిదిన్నరేళ్ల క్రితం, తన కూతురు ప్రియ కూడా ఇదే పద్ధతిలో హత్య చేయబడటం ధృవ జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటాడు. అయితే ఆ హంతకులను పట్టుకునే ప్రయత్నంలో ధృవ శరీరం కూడా సగం నల్లగా మారిపోతుంది. ఇన్నేళ్ల తర్వాత అలాంటి ఓ కేసు మళ్ళీ వెలుగులోకి రావడంతో, ధృవ దీన్ని వ్యక్తిగత సవాలుగా స్వీకరిస్తాడు. తన కూతురిలా ఇంకెవరూ బలి కాకూడదని సంకల్పిస్తాడు. ఈ దర్యాప్తులో ధృవకు అరవింద్ (అజయ్ ధీషన్) అనే వ్యక్తిపై అనుమానం కలుగుతుంది. అయితే, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రియ శక్తులను ప్రదర్శించడం ధృవను విస్మయానికి గురి చేస్తుంది. అసలు అరవింద్ అలా ఎలా చేయగలుగుతున్నాడు. ఈ మిస్టరీలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల వంటి పాత్రల ప్రాధాన్యత ఏమిటి? అసలు ఈ దారుణమైన హత్యలకు కారణం ఎవరు? వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి? ఈ చిక్కుముడులన్నింటినీ ధృవ ఎలా ఛేదిస్తాడు? చివరికి హంతకుడిని ఎలా పట్టుకుంటాడు? అనేదే ‘మార్గన్’ కథ.