నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర తదితరులు
దర్శకత్వం: అరుణ్ ప్రభు
నిర్మాత, మ్యూజిక్: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫిం షెల్లీ కాలిస్ట్
ఎడిటర్: రేమాండ్ డెర్రిక్ క్రాస్టా
ఆర్ట్: శ్రీరామన్
సమర్పణ: మీరా విజయ్ ఆంటోని
బ్యానర్: విజయ్ ఆంటోని కార్పోరేషన్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, స్రవంత్ రామ్ క్రియేషన్స్
విడుదల తేదీ : సెప్టెంబర్ 19
ఇటీవలే మార్గన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు మంచి విజయం అందుకున్న నటుడు విజయ్ ఆంటోని మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భద్రకాళి. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా.. విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది చూసుకుంటే..
కథ
ఖమ్మం జిల్లాలో అనాథగా పెరిగిన కిట్టూ (విజయ్ ఆంటోని) తెలుగు రాజకీయాల్లో పైరవీలు, లాబీయింగ్ చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తుంటాడు. తన అసాధారణ ప్రతిభతో అసాధ్యమైన పనులను సైతం సులభంగా పూర్తిచేసి కోట్లు కూడబెడుతుంటాడు. అయితే కిట్టూ ఎదుగుదలను చూసిన రాజకీయ వ్యూహకర్త, పారిశ్రామికవేత్త అయిన అభ్యంకర శంకర్ (సునీల్ కృపాలనీ) అతడిపై 100కు పైగా కేసులు పెట్టి అక్రమంగా సంపాదించిన రూ. 6,236 కోట్లను సీజ్ చేసి అతన్ని జైలులో వేస్తాడు. అయితే అసలు కిట్టూ ఎవరు? అతని గతం ఏంటి? పైరవీకారుడిగా ఎందుకు మారాడు? అభ్యంకర్‌తో అతనికి ఉన్న పగ ప్రతీకారాలు ఏమిటి? లక్షల కోట్లు సంపాదించిన డబ్బును కిట్టూ ఏం చేశాడు? అభ్యంకర్ కలలను ఎలా కూల్చాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ భద్రకాళి సినిమా.
విశ్లేషణ
చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయంతో అనాథగా మారిన కిట్టూ సమాజంలోని లోపాలను అర్థం చేసుకుని ఒక ‘రాబిన్‌హుడ్’లా పేదలకు సహాయం చేయాలనుకుంటాడు అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సినిమాను రాసుకోన్నాడు. అయితే కథను గందరగోళం లేకుండా సూటిగా నడిపి ఉంటే ఇది ఒక అద్భుతమైన పొలిటికల్ థ్రిల్లర్ అయి ఉండేది. ఫస్టాఫ్‌లో కథ ఆసక్తికరంగా, గ్రిప్పింగ్‌గా అనిపించినా, ఒకే పాయింట్‌పై కథనం నడపడం వల్ల సెకండాఫ్ నెమ్మదిగా సాగింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ వరకు చాలా సాగదీత ఉన్నట్లు అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నిడివి ఎక్కువగా ఉండటం మరో మైనస్. సంభాషణలు సన్నివేశాల్లో నీతి బోధన ఎక్కువగా ఉండటం కొన్నిచోట్ల ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. అయినా విజయ్ ఆంటోని మంచి ప్రయత్నం చేశారనిపిస్తుంది.
నటీనటులు
విజయ్ ఆంటోని తన బాడీ లాంగ్వేజ్, నటనకు తగినట్టుగా కిట్టూ పాత్రలో ఒదిగిపోయారు. అయితే కథ, కథనాల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందనిపిస్తుంది. విలన్ పాత్రలో సునీల్ కృపలానీ మారుతిగా సెల్ మురుగన్ పాత్రలు పర్వాలేదనిపించారు. కానీ హీరోయిన్ పాత్రతో సహా ఇతర పాత్రలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఎమోషన్స్ సెంటిమెంట్ పండించే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు ఆ దిశగా ప్రయత్నించకపోవడంతో సినిమా ఒక సాధారణ రివెంజ్ డ్రామాగా మిగిలిపోయింది.
సాంకేతికంగా
ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక ప్లస్ పాయింట్. అయితే, దానికి తగ్గట్టుగా ప్రభావవంతమైన సన్నివేశాలు లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. విజయ్ ఆంటోని స్వయంగా అందించిన సంగీతం, పాటలు అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగా ఉన్నప్పటికీ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ మరింత షార్ప్‌గా పనిచేసి ఉండాల్సిందనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. చివరిగా ‘భద్రకాళి’ ఒక రివెంజ్ పొలిటికల్ డ్రామా. దర్శకుడు మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నా దానిని సరైన కథనంతో ముందుకు తీసుకెళ్లడంలో కొంత తడబడ్డారని సినిమా చూస్తే తెలుస్తుంది. సమాజంలో పారిశ్రామికవేత్తల దోపిడీ ధనవంతులు మరింత ధనవంతులుగా మారడం, దేశ సంపద విదేశాలకు తరలిపోవడం వంటి అంశాలను చూపించిన విధానం మెచ్చుకోదగినదే. విజయ్ ఆంటోని సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది.