దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత ‘భూల్ భూలయ్యా 3’ ఫ్రాంఛైజీలో భాగమైంది కథానాయిక విద్యాబాలన్. కార్తిక్ ఆర్యన్, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్ని పోషించారు. బుధవార ట్రైలర్‌ను విడుదల చేశారు. జైపూర్‌లో నిర్వహించిన ఈ వేడుకలో మాట్లాడిన విద్యాబాలన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత తాను ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘తొలి రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ ఎక్కువగా జైపూర్‌లోనే షూట్ చేశారు. అలా ఈ నగరంతో ఎంతో అనుబంధం ఏర్పడింది. అందుకే ఈ ట్రైలర్ ఇక్కడ విడుదల చేశాం. తప్పకుండా మీరందరూ ఈ సినిమా చూడండి. లేకపోతే సినిమాలోని దయ్యం పాత్ర మంజులిక మిమ్మల్ని రాత్రిళ్లూ వెంటాడుతుంది. మీకు నిద్ర కరువవుతుంది’ అంటూ సరదా మాటలతో నవ్వుల్ని పంచింది. ఈ సినిమాలో కీలకమైన మంజులిక అనే దెయ్యం పాత్రలో విద్యాబాలన్ నటించింది. ఆద్యంతం కామెడీ, హారర్ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. 2022లో విడుదలైన ‘భూల్ భూలయ్యా-2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.