Vidya Balan | సినిమా ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. వరుస విజయాలొస్తే గోల్డెన్ లెగ్ అని పొగడ్తల వర్షం కురుస్తుంది. అదే పరాజయాలు ఎదురైతే మాత్రం “ఐరన్ లెగ్”, “నెగటివ్ ఎనర్జీ” అంటూ దారుణమైన ముద్రలు వేస్తారు. అలాంటి అనుభవాన్ని బాలీవుడ్ నేషనల్ అవార్డ్ విజేత విద్యా బాలన్ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొంది. విద్యా బాలన్ తొలిసారిగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి ‘చక్రం’ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాతే సినిమా అనూహ్యంగా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోవడానికి కారణం విద్యా అని ఇండస్ట్రీలో ఓ ప్రచారం మొదలైంది.
విద్యా బాలన్ వలన అంతా నష్టం జరిగింది, ఆమె నెగటివ్ ఎనర్జీ గర్ల్ అనే ముద్ర వేసారట. అయితే దీనిపై స్పందించిన విద్యా బాలన్ .. చక్రం సినిమా ఆగిపోవడానికి కారణం నేను కాదు. మోహన్ లాల్, దర్శకుడి మధ్య అభిప్రాయ భేదాలే కారణం. కానీ నన్నే కారణమంటూ చెప్పుకొచ్చారు. నేను చేసింది కేవలం నటన మాత్రమే అని విద్యా బాలన్ పేర్కొంది. ఈ సినిమా నిలిచిపోవడం విద్యా కెరీర్‌పై బాగా ప్రభావం చూపించింది. అప్పటికే సైన్ చేసిన 8–9 ప్రాజెక్టులు కూడా ఆమె నుంచి వెళ్లిపోయాయి. ఆ సమయంలో మాలీవుడ్‌కి విద్యా బాలన్ సరిపోదన్న ప్రచారం కూడా జరిగింది.
ఇంత ప్రతికూలతల మధ్య విద్యా బాలన్ బాలీవుడ్ వైపు అడుగుపెట్టింది. ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఆమె, అందరి అంచనాలు తలకిందులు చేసింది.ఆ తర్వాత వచ్చిన ‘ది డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘తుమ్హారీ సులు’, ‘షేర్నీ’ లాంటి సినిమాలు ఆమెకు పేరు, ప్రతిష్ఠతో పాటు జాతీయ అవార్డుల వరకూ తీసుకువచ్చాయి. కాగా, ఇండస్ట్రీలో ఊహలు, అపోహలు, నమ్మకాలే ఎక్కువ. కానీ విద్యా బాలన్ తన ప్రతిభతో, పట్టుదలతో ఆ ముద్రల్ని తుడిచేసి, స్టార్‌గా ఎదిగింది. ఆమె ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.