Daggubati Venkatesh | టాలీవుడ్లో రీమేక్‌ల ప్రస్తావన వస్తే ముందుగా వినిపించే పేరు వెంకటేష్. నిజానికి రీమేక్ సినిమాలంటేనే రిస్క్ అని అంటుంటారు. ఎందుకంటే ఒరిజినల్ రిజల్టే రిపీటవుతాయని గ్యారెంటీ లేదు. కొంచెం తేడా కొట్టినా నిర్మాతలకు కోట్ల నష్టం ఖాయం. అలాంటిది వెంకీకి మాత్రం రీమేక్‌లు బాగా కలిసి వచ్చాయి. అంతేనా తిరుగులేని బ్లాక్బస్టర్లు కూడా అయ్యాయి. చంటి, సూర్యవంశం, రాజా, ఘర్షణ లాంటి రీమేక్ సినిమాలు వెంకీ మామ మార్కెట్‌ను ఎన్నో రెట్లు పెంచాయి. అందుకే ఐదు పదుల వయసు దాటినా దృశ్యం, గురు, నారప్ప వంటి రీమేక్ సినిమాలతో అలరిస్తూనే వచ్చాడు. అన్నీ బ్లాక్బస్టర్లు అనలేం కానీ, వెంకీ మామ కెరీర్లో కొన్ని రీమేక్‌లు బెడిసి కొట్టినవి కూడా ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ ఓ బ్లాక్ బస్టర్ రీమేక్‌ను పక్కన పెట్టేశాడట. నాలుగేళ్ల క్రితం హిందీలో సూపర్ హిట్టయిన ‘దే దే ప్యార్ దే’ సినిమా రీమేక్ హక్కులను సురేష్ బాబు కొనుక్కున్నాడు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమాలో టబు భార్యగా, రకుల్ గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించింది. ఇంట్లో పిల్లలున్న భార్య ఉండగానే ఓ యవ్వనపు అమ్మాయితో హీరో ప్రేమలో పడతాడు. దీంతో వాళ్ల ముగ్గురి జీవితాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. సరదాగా సాగే ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ టర్న్ తీసుకుని హ్యాపీ ఎండింగ్‌తో ముగిస్తుంది. కథ ఎన్నోసార్లు విన్నదే అయినా డైరెక్టర్ అకిల్ అవి ఇప్పటి పరిస్థుతులకు తగ్గట్లు బాగా తెరకెక్కించాడు. ఇక చాలా కాలం తర్వాత అజయ్ దేవగణ్‌కు ఈ సినిమా తిరుగులేని హిట్‌గా నిలిచింది.
ఇక ఇదే కథను వెంకటేష్‌తో తీద్ధామని సురేష్ బాబు రీమేక్ హక్కులను కొని, డైరెక్టర్ శ్రీవాస్ చేతిలో పెట్టాడు. గోపి మోహన్‌తో సహా పలువురు రచయిలతో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయించి ఆర్టిస్టులకు అడ్వా్న్స్ కూడా ఇచ్చేశాడు. ఇక అప్పుడే అసురన్ సినిమా చూసిన వెంకీకి దానిపై మనసు పడింది. దాంతో హిందీ రీమేక్ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడింది. తర్వాత మళ్లీ ఎన్ని సార్లు ఆ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేద్ధామన్ని కలిసి రాలేదు. ఈ లోపు కరోనా వచ్చింది. ఇక కరోనాలో ఈ సినిమా ఓరిజినల్ వెర్షన్‌ను చాలా మంది చూసేశారు. దాంతో దే దే ప్యార్ దే రీమేక్ అటకెక్కేసింది. అయితే ఈ విషయం తెలిసిన పలువురు వెంకీ అభిమానులు ఆ సినిమా రీమేక్ చేయకపోవడమే మంచిదైందని కామెంట్స్ చేస్తున్నారు.