e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home సినిమా ‘అభినయ శారద’ జయంతి కన్నుమూత

‘అభినయ శారద’ జయంతి కన్నుమూత

సీనియర్‌ సినీ నటి జయంతి(76) సోమవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాసవిడిచింది. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో దక్షిణాదితో పాటు హిందీ, మరాఠీ భాషల్లో ఐదు వందలకుపైగా చిత్రాల్లో జయంతి నటించారు. కెరీర్‌ తొలినాళ్లలో బోల్డ్‌ పాత్రల ద్వారా సంచలనం సృష్టించిన ఆమె అనంతరం కరుణ,అర్ద్రత కలబోసిన పాత్రలతో అభినయశారదగా వినుతికెక్కారు. జయంతి మరణంతో దక్షిణాది చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. దిగ్గజ నటిని కోల్పోయామని సినీ ప్రముఖులు ఆమెకు సంతాపాన్ని తెలిపారు.

జగదేకవీరుడి కథతో
కర్ణాటకలోకి బళ్లారిలో జన్మించారు జయంతి. ఆమె అసలు పేరు కమలకుమారి. కన్నడ చిత్రం ‘జేనుగూడు’ తో కమలకుమారిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు వై.ఆర్‌ స్వామి ఆమె పేరును జయంతిగా మార్చాడు. తొలి సినిమాలోనే సెంటిమెంట్‌ ప్రధాన పాత్రలో చక్కటి నటనను కనబరిచి సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది జయంతి. దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి రూపొందించిన ‘జగదేకవీరుడి కథ’తో తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ చిత్ర అద్వితీయ విజయంతో కథానాయికగా తెలుగు చిత్రసీమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నదామె. తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌, కాంతారావు, శోభన్‌బాబుతో పాటు అలనాటి అగ్రహీరోలందరితో కలిసి జయంతి సినిమాలు చేసింది. డాక్టర్‌ చక్రవర్తి, శారద, శ్రీరామాంజనేయ యుద్దం, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి లాంటి చిత్రాలు ఆమెకు చక్కటి గుర్తింపును తెచ్చిపెట్టాయి. కథానాయికగానే కాకుండా సహాయ నటిగా పెదరాయుడు, స్వాతికిరణం, వంశానికొక్కడు లాంటి చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో కనిపించింది. కె.వి.రెడ్డి తెలుగు చిత్రసీమకు తనను పరిచయం చేస్తే నటనలో మెలకువలను కె. విశ్వనాథ్‌ నేర్పించారని ఆమె ఎప్పుడూ చెబుతుండేది. ఎన్టీఆర్‌, సావిత్రి నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నానని పలు సందర్భాల్లో ఆమె పేర్కొన్నది.

- Advertisement -

రాజ్‌కుమార్‌తో 45 చిత్రాలు
కన్నడ చిత్రసీమలో అగ్రకథానాయికల్లో ఒకరిగా జయంతి గుర్తింపును సొంతం చేసుకున్నది. కన్నడంలో రాజ్‌కుమార్‌ సరసన ‘చంద్రవళ్లియతోట’ అనే సినిమాలో తొలిసారి జయంతి నటించింది. ఉత్తమ కన్నడ చిత్రంగా ఈ సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకోవడంతో రాజ్‌కుమార్‌, జయంతి జోడీకి మంచి పేరొచ్చింది. వీరిద్దరి కలయికలో కన్నడంలో 45కిపైగా చిత్రాలు రూపొందాయి. జయంతి కథానాయికగా నటించిన ‘మిస్‌ లీలావతి’ చిత్రం కన్నడంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. బోల్డ్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఆ రోజుల్లోనే స్విమ్‌సూట్‌ ధరించి జయంతి కనిపించడం సంచలనంగా మారింది. ఈ సినిమాతో బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ హీరోయిన్‌గా జాతీయ స్థాయిలో ఆమె పేరు మార్మోగింది. ఈ సినిమాకుగాను ఇందిరాగాంధీ చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని జయంతి అందుకున్నారు. తమిళంలో శివాజీ గణేషన్‌, జెమిని గణేషన్‌, నగేష్‌, జైశంకర్‌, ముత్తురామన్‌ వంటి అగ్రహీరోల సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. పడగొట్టి, ముగరాసి, కన్న నలమ, వెళ్లి విజా, పున్నాగై, గంగా గౌరి చిత్రాలు తమిళంలో ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. కథానాయిక, తల్లి, సోదరి పాత్రలతో పాటు కొన్నిసార్లు వాంప్‌ పాత్రల్ని పోషించి వైవిధ్యతను చాటుకున్నారు జయంతి. అందరి శ్రేయోభిలాషిగా, అజాతశత్రువుగా సినీ పరిశ్రమలో పేరుతెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీ, మరాఠీతో పాటు ఆంగ్లంలోనూ ఓ సినిమా చేసింది జయంతి. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఏడు పర్యాయాలు కర్ణాటక రాష్ట్ర సినీ పురస్కారాన్ని అందుకున్నారామె. వీటితో పాటు మైసూర్‌ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌తో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు.

రాజకీయాల్లో నిరాశ
ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ప్రోద్భలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు జయంతి. రెండు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. తాను ఓటమిపాలైన సందర్భంగా ‘మహిళలకు మద్దతునిచ్చే మనస్తత్వం మన సమాజంలో లేదు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ఈ వివక్ష ఉంది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్‌ను పెళ్లాడారు జయంతి. అభిప్రాయభేదాలతో కొద్దికాలంలోనే వారు విడిపోయారు. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజశేఖర్‌ను వివాహం చేసుకున్నారామె.

నాటి నుంచి నేటి వరకు అనేక తరాలతో కలిసి పనిచేసిన గొప్ప నటి జయంతిగారు. నాన్నగారి ‘జగదేకవీరుని కథ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై ఆ తర్వాత ‘కులగౌరవం’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్‌ చౌదరి’ వంటి అజరామరమైన చిత్రాల్లో ఆయనతో కలిసి నటించారు. నేను హీరోగా నటించిన ‘ముద్దుల మేనల్లుడు’, ‘తల్లిదండ్రులు’, ‘వంశానికొక్కడు’ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నాను
– నందమూరి బాలకృష్ణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana