Venky Rerelease | ఈ మధ్య రీ రిలీజ్ సినిమాలకు డిమాండ్ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ సరైన సినిమా పడితే థియేటర్లో ఎలా గోల చేస్తారో తాజాగా వెంకీ సినిమా మరోసారి నిరూపించింది. 2004లో రవితేజ, శీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ఈ ఆల్ టైం క్లాసిక్ కామెడీ సినిమాను డిసెంబర్ 30న మళ్లీ విడుదల చేశారు. చాలా తక్కువ థియేటర్స్లో విడుదలైన వెంకీకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో స్క్రీన్స్ నెమ్మదిగా పెంచేస్తున్నారు. ముందు రెండు రోజులు మాత్రమే ఈ సినిమాను థియేటర్లో ఉంచాలి అనుకున్నా.. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూశాక వారం రోజులకు పొడిగించారు దర్శక నిర్మాతలు. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్ హీరోల సినిమాలకు రీ రిలీజ్ అసలు కలిసి రావడం లేదు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలు కూడా వచ్చినట్టు ప్రేక్షకులకు గుర్తు లేదు.
2022లో పోకిరి, జల్సా, ఖుషి, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాలను థియేటర్లలో పండగ చేసుకున్నారు అభిమానులు. ఒక్కో సినిమాకు 5 నుంచి 8 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ ఏడాది మొదట్లో కూడా ఒక్కడు, ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింహాద్రి లాంటి సినిమాలకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. సింహాద్రి అయితే మొదటి రోజే 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే ఆ తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్యాంగ్ లీడర్, అదుర్స్ లాంటి సినిమాలు రీ రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. అనవసరంగా మా హీరోల సినిమాలు విడుదల చేసి ఉన్న పరువు తీయకండి అంటూ అభిమానులు కూడా ఫైర్ అయ్యారు. ఇలాంటి సమయంలో వెంకీ సినిమాను మరోసారి విడుదల చేస్తే చూస్తారా అనుమానాలు అందరిలోనే ఉండేవి. కానీ అందరి డౌట్స్ పటాపంచలు అయ్యాయి. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి దర్శక నిర్మాతలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ ట్రాక్ తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైం క్లాసిక్గా నిలిచిపోయింది. అలాగే ట్రైన్ ఎపిసోడ్ కూడా నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంటుంది. ఈరోజు థియేటర్లలో కూడా ఇదే రిపీట్ అయింది. రిలీజ్ టైంలో కూడా ఈ సినిమాను ఇంతగా ఎంజాయ్ చేశారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ప్రతి సీన్ థియేటర్లో మార్మోగిపోయింది. ముఖ్యంగా అక్కడ డైలాగ్ చెప్తుంటే థియేటర్ మొత్తం ముక్తకంఠంతో ఆ డైలాగ్స్ రిపీట్ చేస్తున్నారు. దాంతో థియేటర్స్ మొత్తం షేక్ అయిపోతున్నాయి. బ్రహ్మానందం ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ కంఠస్థం చేశారు అభిమానులు. అది మాత్రమే కాదు.. ట్రైన్ ఎపిసోడ్లో వేణుమాధవ్ పాడే పాటలు, రవితేజ ఎనర్జీ అంతా థియేటర్లలో మార్మోగిపోతుంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత కచ్చితంగా మరిన్ని క్లాసిక్ కామెడీ సినిమాలను రిలీజ్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.