Ved Movie | అక్కినేని నాగచైతన్య సినిమాల్లో ‘మజిలీ’కు ప్రత్యేక స్థానం ఉంటుంది. విడాకుల ముందు సమంతతో కలిసి నాగచైతన్య నటించిన చివరి సినిమా ఇదే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఒక లవ్‌స్టోరీతో కమర్షియల్ సినిమా రేంజ్ కలెక్షన్లు కూడా సాధించొచ్చు అని ఈ సినిమా నిరూపించింది. రీయల్ లైఫ్ భార్య భర్తలుగా ఉన్న సమయంలో చైసామ్ కలిసి ఈ సినిమాలో నటించడంతో రీల్లో కూడా ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. అదే సినిమా సక్సెస్‌కు కారణమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరాఠీలో ‘వేద్’గా రీమేక్ అయ్యింది.
బాలీవుడ్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కలిసి నటించిన ఈ రీమేక్ సినిమా ఇటీవలే రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.10 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. మరాఠిలో ఇంత తక్కువ టైమ్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన మొదటి సినిమా ఇదేనట. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు దర్శకుడు రితేషే. దర్శకుడిగా రితేష్ మొదటి అడుగులోనే సక్సెస్ సాధించాడు. ఈ సినిమా కేవలం మారాఠి భాషలోనే రిలీజైంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాకపోయినా.. ఢిల్లీ వంటి పలు నగరాల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తుంది.
‘సైరాత్’ తర్వాత మరాఠి నుండి ఆ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు వస్తుంది. నిజానికి మరాఠి పరిశ్రమ చాలా చిన్నది. టాలీవుడ్లో ఒక పెద్ద సినిమాకి అయ్యే బడ్జెట్‌తో అక్కడ పది సినిమాలు తీస్తారు. దాంతో పరిమిత సంఖ్యలోనే అక్కడి సినిమాలు రిలీజవుతుంటాయి. దాంతో ఎక్కువగా జనాలకు అక్కడి సినిమాలు తెలియవు. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీల పుణ్యమా అని పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో అక్కడి పరిశ్రమకు గుర్తింపు వస్తుంది. ఇక ఇప్పుడు వేద్ సినిమాతో మారాఠి పరిశ్రమకు మరింత గుర్తింపు వస్తుంది.