Matka Movie Review | వరుణ్ తేజ్ గత రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈసారి రొటీన్ కి కాస్త భిన్నంగా వుండే కథలు చేసే దర్శకుడు కరుణ కుమార్ తో జతకట్టారు. వీరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘మట్కా’. వరుణ్ తేజ్ మూడు గెటప్పుల్లో కనిపించిన ప్రచార చిత్రాలు ఆసక్తిని రేపాయి. ఈసారి గట్టిగా కొడుతున్నామని స్వయంగా వరుణ్ తేజ్ చెప్పడం ఇంకా అంచనాలు పెంచింది. మరా అంచనాలని మట్కా అందుకుందా? వరుణ్ తేజ్ ఖాతలో హిట్టు పడిందా? రివ్యూలో చూద్దాం.
కథ: బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వస్తాడు వాసు (వరుణ్ తేజ్). ఓ హత్య చేసి చిన్నతనంలోనే జైలుకు వెళ్తాడు. అక్కడ రాటు తేలిపోతాడు. వాసు జైలు నుంచి విడుదలయ్యాక పూర్ణ మార్కెట్ లో కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి (అజయ్ ఘోష్) దగ్గర పనికి చేరతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఓ గొడవలో కె.బి (జాన్ విజయ్) రౌడీ గ్యాంగ్‌ను ఎదురించిన వాసు.. అక్కడి నుంచి పూర్ణ మార్కెట్‌కు నాయకుడిగా, మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
వాసు అనే కుర్రాడి బయోపిక్ ఇది. మట్కా అనేది అతని జీవితంలో ఓ చిన్న భాగమే. ఈ మట్కా పాయింట్ కూడా రతన్ ఖత్రీ జీవితం నుంచి తీసుకున్నారు. ఆయన పాకిస్తాన్ నుంచి ముంబై వస్తాడు. ఇక్కడ వాసు బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. అయితే మట్కా అనే టైటిల్ వుండటంతో ఆ జూదం చుట్టూ కథ వుంటుదని ఆశిస్తే నిరాశ తప్పదు. ఎప్పుడో ఇంటర్వెల్ కి ముందు గానీ ఆ పాయింట్ రాదు.
దర్శకుడు ఈ కథని ఒక బయోపిక్ లానే తీశారు, వాసు బాల్యంతో కథ మొదలౌతుంది. అలా అతని జీవితంలో ఒకొక్క దశని చూపిస్తూ కథనం ముందు సాగుతుంది. రెగ్యులర్ మాస్ కథలకు భిన్నంగా వుండటం, వరుణ్ తేజ్ గెటప్పు, మట్కా నేపధ్యం ఇవన్నీ కూడా కొత్త అనుభూతిని పంచుతాయి. అయితే మాస్ కి టార్గెట్ చేసిన ఈ కథలో హై మూమెంట్స్ తక్కువగా వుంటాయి. సిబిఐ నేపధ్యంలో వచ్చే సీన్స్ అంత బలంగా వుండవు. అలాగే కథనంలో కూడా వేగం తగ్గింది. అయితే వరుణ్ తేజ్ నుంచి ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు.
నటీనటులు:
వరుణ్ తేజ్ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. పాత్రకు న్యాయం చేశాడు. గెటప్స్ లో వైవిధ్యం చూపించాడు. మీనాక్షి చౌదరి పాత్ర కు పెద్ద ప్రాధాన్యత లేదు. నౌరా గ్లామరస్ పాత్రలో కనిపించింది. బలమైన విలన్ పాత్ర లేదు ఇందులో కనిపించదు. అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవిశంకర్, నవీన్ చంద్ర పాత్రలు పరిధిమేరకు కనిపిస్తాయి.
టెక్నికల్: జీవి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. కాస్య్టూమ్స్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. కరుణ కుమార్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. వింటేజ్ వైజాగ్ ని సహజంగా చుపించారు.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్
మట్కా నేపధ్యం
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
కథనం వేగం లేకపోవడం
హై మూమెంట్స్ మిస్ కావడం
రేటింగ్: 2.75/5