‘వాసు ఓ ఫారెస్ట్ ఆఫీసర్. ఇందు అనే గిరిజన యువతితో అతడు ప్రేమలో పడతాడు. వారి ప్రేమప్రయాణం ఏ మజిలీకి చేరిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు వరుణ్‌సందేశ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇందువదన’. ఎంఎస్ఆర్ దర్శకుడు. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఫర్నాజ్‌శెట్టి కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. ఈ మేరకు వరుణ్‌సందేశ్ కొత్త లుక్‌ను ఇటీవల చిత్రబృందం విడుదలచేసింది. ఈ సినిమాలో వాసు అనే అటవీశాఖ అధికారిగా వరుణ్‌సందేశ్ కనిపించబోతున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘హారర్ అంశాలు మిళితమైన ప్రేమకథా చిత్రమిది. వరుణ్‌సందేశ్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుంది. హీరోగా ఈ చిత్రం అతడికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకముంది. ఇటీవల సారథి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్స్‌లో పతాక ఘట్టాలను చిత్రీకరించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. రఘుబాబు, అలీ, నాగినీడు, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివకాకాని, సినిమాటోగ్రఫీ: బి.మురళీకృష్ణ.