‘గతంలో ఎస్వీసీ సంస్థ నిర్మించిన ‘జాను’ సినిమాలో నటించాను. ‘తమ్ముడు’ కోసం ఆ సంస్థ నుంచి మళ్లీ కాల్ రాగానే మరో ఆలోచన చేయకుండా వచ్చి ఆడిషన్ ఇచ్చాను. లుక్టెస్ట్లో ఓకే అయ్యాను. డైరెక్టర్ శ్రీరామ్‌వేణు ఈ సినిమా గురించి చెబుతూ ‘అడవుల్లో షూటింగ్ చేయాల్సి వుంటుంది.. అభ్యంతరం అయితే చెప్పండి?’ అనడిగారు. నేను ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తానని చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాను.’ అని కథానాయిక హర్ష బొల్లమ్మ తెలిపారు. నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ప్రస్టేజియస్ మాస్ ఎంటైర్టెనర్ ‘తమ్ముడు’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయికల్లో ఒకరైన వర్ష బొల్లమ్మ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో నా పాత్ర పేరు చిత్ర. నితిన్ క్యారెక్టర్ పేరు జై. హీరోకు డ్రైవింగ్ ఫోర్స్‌లా నా పాత్ర ఉంటుంది. జై కు అన్ కండిషనల్‌గా సపోర్ట్ చేస్తుంది చిత్ర. మా మధ్య రిలేషన్ చాలా బావుంటుంది. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేసే కేరక్టర్ చిత్రది.
ఈ సినిమాకోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నా. ‘బిగిల్’ మూవీ తర్వాత ఫిజికల్‌గా నేను శ్రమించిన సినిమా ఇదే. లయ ఇందులో కీరోల్ చేశారు. ఆమెతో కలిసి పని చేయడం గొప్ప ఎక్స్పీరియన్స్.’ అని చెప్పారు వర్ష బొల్లమ్మ. దట్టమైన మారేడుమిల్లి అడవిలో షూటింగ్ చేశామని, వర్షాకాలం కావడంతో పాములు, తేళ్లూ కూడా కనిపించేవని, రాత్రిపూట కాగడాలు పట్టుకొని తిరగాల్సొచ్చేదని, అందరం ప్రాణం పెట్టి ఈ సినిమాకు పనిచేశామని వర్ష తెలిపారు. ‘నితిన్ చాలా కామెడీగా ఉండే ఫన్ పర్సన్. ఆయనతో పనిచేయడం గొప్ప ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇదో విజువల్ ట్రీట్. థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ప్రస్తుతం ‘కానిస్టేబుల్ కనకం’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ఇంకా పేరు నిర్ణయించని సిరీస్‌లోకూడా నటిస్తున్నా. అలాగే రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. వాటి డీటెయిల్స్ త్వరలో చెబుతా. సైకో కిల్లర్‌గా కనిపించాలనేది నా కోరిక. అలాంటి అవకాశం వస్తే వదులుకోను.’ అని చెప్పుకొచ్చారు వర్ష బొల్లమ్మ.