By Maduri Mattaiah
నటీనటులు: పవన్‌కల్యాణ్, అంజలి, నివేధా థామస్, అనన్య, శృతిహాసన్, ప్రకాష్‌రాజ్ తదితరులు
దర్శకుడు: శ్రీరామ్ వేణు
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రాఫర్: పి.ఎస్. వినోద్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
అమితాబ్‌బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో ఐదేళ్ల క్రితం హిందీలో వచ్చిన ‘పింక్’ చిత్రం నవీన మహిళల స్వేచ్ఛా ప్రియత్వం..దానిని సమాజం స్వీకరించే విధానం..ఈ క్రమంలో తలెత్తె నైతిక సంఘర్షణను మానవీయ కోణంలో ఆవిష్కరించింది. స్త్రీని మగాడు చూసే ‘చూపు’లో మార్పు రావాలనే బలమైన సందేశాన్ని అందించింది. సామాజిక, ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైన తరుణంలో ‘పింక్’ చిత్రం ఓ అర్థవంతమైన సామాజిక చర్చను లేవనెత్తింది. అమ్మాయి ‘నో’ అని చెప్పిందంటే ఆమె నిర్ణయానికి ఇక తిరుగు ఉండదని…మహిళ తన అభీష్టం మేరకే నడచుకుంటుందని…వ్యతిరేక పరిస్థితులు ఎదురైతే ప్రతిఘటించడం ఆమె హక్కు అని గుర్తుచేసింది.
ఇంతటి బలీయమైన సామాజిక, మానవీయ స్పృహ ఉన్న కథాంశం కాబట్టే ‘పింక్’ రీమేక్ కోసం తమిళ, తెలుగు పరిశ్రమలు ఆసక్తిని ప్రదర్శించాయి. తమిళంలో అజిత్ కథానాయకుడిగా ‘నేర్కొండ పరావయ్’ పేరుతో పునర్నిర్మాణం జరుపుకొని అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమా తెలుగు రీమేక్ బాధ్యతను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్వీకరించడం, పవన్‌కల్యాణ్ వంటి అగ్ర కథానాయకుడు నటించడంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం నుంచే యావత్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్‌కల్యాణ్ తిరిగి సినిమా చేయడంతో ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. ఇంతటి భారీ అంచనాల మధ్య ప్రేక్షకులముందుకొచ్చిన ‘వకీల్‌సాబ్’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
కథ గురించి..
జరీనా(అంజలి), పల్లవి(నివేదా థామస్), దివ్య నాయక్(అనన్య) ముగ్గురు ప్రాణ స్నేహితులు. కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగాల చేసేందుకు హైదరాబాద్ వచ్చిన వారు ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తుంటారు. ఓ రోజు జరీనా ఆఫీస్‌లో జరిగిన పార్టీకి ముగ్గురు హాజరవుతారు. తిరుగు ప్రయాణంలో జరిగిన కొన్ని అనూహ్య సంఘటనల వల్ల వారు ఎంపీ కొడుకు వంశీపై దాడిచేస్తారు. ఆ ముగ్గురు యువతులపై కోపం పెంచుకున్న వంశీ తన అధికార బలంతో వారిపై హత్యాయత్నంతో పాటు వేశ్యలుగా చిత్రీకరించి తప్పుడు కేసులు పెడతారు. తమకు జరిగిన అన్యాయంపై చట్టప్రకారం పోరాడాలని అనుకున్న జరీనా, పల్లవి, దివ్యలకు ఎంపీ ప్రలోభాల కారణంగా ఎవరూసహాయం చేయరు. ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సత్యదేవ్ అలియాస్ వకీల్‌సాబ్(పవన్‌కల్యాణ్) అండగా నిలబడతాడు? ఎంపీ సృష్టించిన దొంగ సాక్ష్యాలను బయటపెడుతూ సత్యదేవ్ తన వాదనల్ని ఎలా కోర్టులో వినిపించాడు? ముగ్గురు అమ్మాయిలకు ఏ విధంగా న్యాయం చేశాడు? అసలు సత్యదేవ్ ఎవరూ? అతడి గతమేమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా మిగతా చిత్ర కథ సాగుతుంది.
విశ్లేషణ..
ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే దర్శకత్వం-మార్పులు అని స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ‘పింక్’ కథలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశారు. కేవలం మాతృకలోని ఆత్మను మాత్రమే తీసుకున్నారు. పవన్‌కల్యాణ్ మాస్ ఇమేజ్ను గ్లోరిఫై చేస్తూ కథకు వాణిజ్య హంగుల్ని అద్దారు. సమాజ శ్రేయస్సు కోసం తపిస్తూ, ప్రజాపక్షాన పోరాడే న్యాయవాది సత్యదేవ్‌గా పవన్‌కల్యాణ్ పాత్రను ఉదాత్తమైన, అభ్యుదయ భావాలు కలబోతగా తీర్చిదిద్దారు. ద్వితీయార్థంలోని కోర్ట్‌రూమ్ డ్రామాను పెద్దగా మార్పులు లేకుండా యథాతథంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ‘పింక్’ కోర్ట్ రూమ్ ఎపిసోడ్‌లోని సంభాషణలు అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా ఉండటంతో అవే సంభాషణల్ని తీసుకున్నారు. ప్రథమార్థంలో మాత్రం పవన్‌కల్యాణ్ అభిమానుల్ని సంతుష్టిపరిచేలా ఆయన పాత్రకు వాణిజ్య అంశాల్ని జోడించారు. ఉస్మానియా యూనిర్సిటీలో విద్యార్థుల పక్షాన నిలిచే విద్యార్థి నాయకుడిగా…అనంతరం లాయర్ సత్యదేవ్‌గా పేదలు, పర్యావరణం, అడవి బిడ్డల తరపున పోరాడే వ్యక్తిగా పవన్‌కల్యాణ్ పాత్రను శక్తివంతంగా చూపించే ప్రయత్నం చేశారు. భార్య మరణంలో సంపన్న జీవితాన్ని వదులుకొని బస్తీలో జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిగా లాయర్ సత్యదేవ్ పాత్రను మానవీయ కోణంలో చూపించారు.
‘పింక్’ చిత్రంలోని కోర్ట్‌రూమ్ డ్రామాలో సంభాషణలే ప్రధానాకర్షణగా నిలిచాయి. ‘వకీల్‌సాబ్’లో కూడా అదే విధంగా సంభాషణల్ని రాసుకున్నారు. ముఖ్యంగా పతాకఘట్టాల్లో జరిగిన చర్చ సినిమా ఆత్మను ప్రతిబింబిస్తుంది. అర్థరాత్రి ఆడది ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనపోయే వాహనాలన్నీ ఒక్కసారిగా ఎందుకు స్లో అవుతాయి? ఆడవాళ్లు ధరించే దుస్తులు మగాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి కాబట్టే అత్యాచారాలు జరుగుతున్నాయి అంటారు..మరి పసిపిల్లల నుంచి వృద్ధురాళ్ల వరకు వయోబేధాలు లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా.. వారందరూ ప్రేరేపించేలా దుస్తులు వేసుకున్నారా? మగవాడి మెదళ్లలో పురుగు తిరుగుతుంటే మందు మహిళల ముఖాలపై కొడితే ఏం లాభం యువరానర్? వంటి సంభాషణలు ఆలోచనాత్మకంగా అనిపించాయి. అయితే కొన్ని సంభాషణలు కథతో ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ ఉద్దేశ్యాల్ని ప్రతిఫలించేలా సాగాయి. సమాజానికి సేవ చేసే గొప్ప ఆశయంతో తానున్నానని, ఎప్పుడైనా తాను ప్రజల పక్షమే అని సంభాషణల ద్వారా పదేపదే చెప్పే ప్రయత్నం చేశారు. ‘పింక్’ చిత్రంలో ముగ్గురమ్మాయిల్ని స్వతంత్య్ర వ్యక్తిత్వం, ఆధునికి భావాలు కలిగిన మహిళలుగా చూపించారు. కానీ ‘వకీల్‌సాబ్’లో ఒక్కొక్కరికి భిన్నమైన సామాజిక నేపథ్యాల్ని జోడించి..మధ్యతరగతి మహిళలుగా వారి పాత్రల్ని ఆవిష్కరించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్…
న్యాయం కోసం పోరాడుతూ సామాన్యులకు అండగా నిలబడే వకీల్‌సాబ్‌గా పవన్‌కల్యాణ్ పాత్ర శక్తివంతంగా సాగింది. యువతరంలో ఆయనకున్న ఇమేజ్, హీరోయిజానికి లాయర్ మేనరిజమ్స్‌ను జోడిస్తూ పవన్ పాత్రను దర్శకుడు శ్రీరామ్‌వేణు విభిన్నంగా తీర్చిదిద్దారు. ద్వితీయార్థంలో కోర్టు రూమ్‌లో వాదనలు వినిపించే సన్నివేశాల్లో పవన్ నటన ఆకట్టుకుంటుంది. తప్పుడు కేసు కారణంగా మనో వ్యథకు గురయ్యే అమాయకులైన యువతులుగా అంజలి, నివేధా థామస్, అనన్య సహజ నటనను కనబరిచారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించే క్రమంలో వారు ఎదుర్కొనే అంతఃసంఘర్షణను హృద్యంగా సినిమాలో చూపించారు. సత్యదేవ్‌కు సవాల్ విసిరే లాయర్ నందగోపాల్గా ప్రకాష్‌రాజ్ పాత్ర పోటాపోటీగా సాగింది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో పవన్‌కల్యాణ్ భార్యగా శృతిహాసన్ అతిథి పాత్రలో కనిపించింది.
డ్రామా, ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమాలో తమన్ తన పాటలతో ప్రేక్షకులకు రిలీఫ్ నిచ్చారు. మెలోడీ సాంగ్ ‘మగువా మగువా..’ ఫాస్ట్ బీట్స్ ‘కదులు కదులు’, ‘సత్యమేవ జయతే’ రొమాంటిక్ డ్యూయెట్ ‘కంటి పాట’ రూపంలో భిన్నత్వానికి ప్రాధాన్యతనిస్తూ పాటల్ని సమకూర్చారు. నేపథ్య సంగీతం కథకు తగినట్లుగా కుదిరింది. పి.ఎస్ వినోద్ ఛాయాగ్రహణం బాగుంది. మామిడాల తిరుపతి చక్కటి సంభాషణల్ని అందించారు. సుదీర్ఘకాలం తర్వాత అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం రావడంతో నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ రాజీపడకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
‘వకీల్‌సాబ్’ చిత్రాన్ని పవన్‌కల్యాణ్‌కు ఉన్న ఇమేజ్, అభిమానగణాన్ని, వాణిజ్య లెక్కల్ని దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దారు. అయితే మాతృకలోని ఆత్మను మిస్ చేయకపోవడం, స్త్రీ సాధికారతపై బలమైన సందేశం వినిపించిన కథ కావడంతో అన్ని వర్గాలకు చేరువయ్యే అవకాశం ఉంది. ‘పింక్’ తో పోల్చకుండా ఈ సినిమాను చూస్తేనే బాగుంటుంది. బాక్సాఫీస్ వద్ద ఆరంభ వసూళ్లకు ఢోకా లేదనిపించేలా ఉంది. అయితే ప్రస్తుతం కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల వేచిచూస్తేనేగానీ ‘వకీల్‌సాబ్’ బాక్సాఫీస్ లెక్కల్ని అంచనా వేయలేం.
రేటింగ్ – 3/5
Review by; MADURI MATTAIAH
ఇవికూడా చదవండి
పవన్ నో అంటే వకీల్ సాబ్ ఎవరు అయ్యేవారో తెలుసా?
అఖిల్‌ను గిల్లిన ఎన్టీఆర్.. వీడియో షేర్ చేసిన ఆర్జీవి