CM Pushkar Singh Dhami | ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం మరియు బోధనల ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని ఉత్తరాఖండ్లో ట్యాక్స్-ఫ్రీగా ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా ప్రారంభమై, ఆ తర్వాత మౌత్ టాక్తో ఊహించని విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
అయితే డెహ్రాడూన్లోని ఒక సినిమా హాల్లో తన సతీమణి గీతా ధామి, కేబినెట్ సహచరులు గణేష్ జోషి, ప్రదీప్ బాత్రా మరియు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఈ సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇలాంటి చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. బాబా నీమ్ కరోలీ మహారాజ్ తపస్సు, త్యాగం, సేవ మరియు హనుమంతుడిపై ఆయనకు ఉన్న అచంచలమైన భక్తిని ఈ సినిమా ద్వారా తెలుసుకునే అవకాశం కలిగిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మానవ సేవకే ఆయన జీవితాన్ని అంకితం చేశారని, భక్తి అంటే కేవలం ఆరాధన మాత్రమే కాదని, సేవ మరియు మానవ కల్యాణ మార్గమని ఆయన జీవితం మనకు చాటిచెబుతుందని సీఎం తెలిపారు.
విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. వీరితో పాటు విహాన్ షెడ్గే, చందన్ కె ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ ట్రేడ్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం తొలి రెండు వారాలు సాధారణ వసూళ్లను రాబట్టినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో పుంజుకుని ఇప్పటివరకు రూ. 97.77 కోట్ల గ్రాస్ రూ. 82.88 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.