‘ఉస్తాద్’ చిత్రంలో నేను మేఘన పాత్రలో కనిపిస్తాను. గవర్నమెంట్ జాబ్ చేయాలనే తండ్రి కోరిక కోసం ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిగా, మానసికంగా శక్తివంతురాలైన యువతిగా నేటి తరం అమ్మాయిలకు దగ్గరగా వుండే పాత్ర అది. తప్పకుండా మేఘన పాత్ర అందరికి నచ్చుతుంది’ అన్నారు కథానాయిక కావ్యా కళ్యాణ్‌రామ్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్’. శ్రీసింహా కోడూరి కథానాయకుడు. ఫణిదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా బుధవారం హీరోయిన్ కావ్యా కళ్యాణ్‌రామ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ‘కంటెంట్‌పై నమ్మకంతో చేసిన సినిమా ఇది. సూర్య అనే పాత్రలో శ్రీసింహా కనిపించబోతున్నాడు. సూర్యకు ప్రేయసిగా మేఘన కనిపిస్తాను. ఎప్పుడూ ఆవేశంగా కనిపించే సూర్యను మెచ్యూర్డ్‌గా ఆలోచించేలా మార్చే అమ్మాయిగా, గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో కనిపిస్తాను అన్నారు.