Ustaad Bhagat Singh | మొన్నటి వరకు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను కమిటైన ప్రాజెక్ట్‌లకి బ్రేక్ వేశాడు. ఇటీవల ఒక్కొక్కటి పూర్తి చేస్తూ దూసుకుపోతున్నాడు. హరిహర వీరమల్లు చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదల కాగా, ఈ మూవీ అభిమానులని కూడా ఏ మాత్రం అలరించలేకపోయింది. ఇక ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అది అభిమానులకే కాదు, టాలీవుడ్ మొత్తానికి ఉత్సాహాన్ని కలిగిస్తుందన్న విషయంలో సందేహం లేదు. ఇప్పుడు అదే స్థాయిలో హైప్ తెచ్చుకుంటున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”.
ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకప్పుడు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్లీ కలిసి వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను ఒక పండుగలా భావిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఫ్యాన్స్ ముందుగానే పండుగను స్టార్ట్ చేశారు. కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్లడ్ డొనేషన్లు, సోషల్ సర్వీస్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ఈ వేడుకలో మేకర్స్ కూడా భాగమవుతూ, ఒకటి తర్వాత ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్ ఈ జోష్‌కు మరింత బలాన్నిచ్చింది. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ షూట్ లుక్‌లో కనిపించగా, ఆయన వింటేజ్ మాస్ స్టైల్, ఎనర్జీ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది.
ఈ లుక్‌లోని కాస్ట్యూమ్, పవన్ బాడీ లాంగ్వేజ్ అంతా అభిమానుల్లో ఫుల్ జోష్ కలిగిస్తుంది. సోమవారం సాయంత్రం 4:45 గంటలకు మేకర్స్ “ఫుల్ మీల్స్” అంటూ హైప్ క్రియేట్ చేయడం చూస్తుంటే, ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు. హరీష్ శంకర్ – పవన్ కలయిక అంటేనే ఫ్యాన్స్‌కు ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. “గబ్బర్ సింగ్”లో ఆయన పవన్ మాస్ ఇమేజ్‌ని ఎలా వాడుకున్నారో అందరికీ గుర్తే. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ చేతిలో పవన్ పడడంతో ఈ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా వస్తుందన్న ఆశలు పెరిగిపోయాయి. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్సుల విషయంలో మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ స్టామినాకు తగ్గ రీతిలో గ్రాండ్ విజువల్స్ చూపించేందుకు అన్ని విభాగాలూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయట. “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా పవన్ అభిమానుల కోసం ఒక ఫుల్ మాస్ ఫెస్టివల్‌గా మారుతోంది.