“టక్ జగదీష్’ భారీ బడ్జెట్ చిత్రం. ఆగస్ట్‌లోనే థియేటర్ రిలీజ్‌కు సన్నాహాలు చేశాం. కానీ కరోనా ప్రభావం తగ్గేలా కనిపించలేదు. అందుకే ఓటీటీ విడుదలకు మొగ్గు చూపాం’ అన్నారు సాహు గారపాటి. ఆయన హరీష్‌పెద్దితో కలిసి నాని కథానాయకుడిగా నిర్మించిన ‘టక్ జగదీష్’ చిత్రం ఈ నెల 10న అమెజాన్ప్రైమ్ ద్వారా ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్మాత సాహు గారపాటి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
నాని ఎప్పుడూ చేయని పాత్ర
కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతల్ని ఆవిష్కరిస్తూ భావోద్వేగభరితంగా సాగే కథ ఇది. దర్శకుడు కథ చెప్పగానే హీరోగా నాని అయితే బాగుంటుందనిపించింది. ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు రావడం తగ్గిపోయింది. అందుకే ఈ కథను తీసుకున్నాం. నాని ఇప్పటివరకు పోషించని సరికొత్త పాత్ర ఇది. సినిమాలో ఆయన్ని చూసిన వారందరు ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ప్రథమార్థం వినోదభరితంగా ఉంటూ ద్వితీయార్థం భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది.
అందుకే ఓటీటీలో..
దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడలేదు. పక్క రాష్ర్టాల్లో కూడా థియేటర్లు అనుకున్న స్థాయిలో తెరచుకోలేదు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో సినిమా ఎక్కువ మందికి చేరువకావాలని ఓటీటీ వైపు అడుగులు వేశాం. ఈ సినిమా విషయంలో ఇండస్ట్రీ నుంచి మాకు మద్దతు లభించింది. అందుకే వివాదాల గురించి మాట్లాడలేదు. హీరో, నిర్మాత ఎవరైనా సరే తమ సినిమాను జనాలకు చూపించాలనే కోరుకుంటారు. వినాయక చవితి పర్వదినాన అందరూ చూసి ఆనందించే చిత్రమవుతుంది.
థియేటర్లే తొలి ప్రాధాన్యత..
బిగ్స్క్రీన్పై వచ్చేంత ఆదాయం ఓటీటీల ద్వారా లభించదు. సినిమాల్ని వీక్షించడానికి ఎన్ని మాధ్యమాలు వస్తున్నప్పటికి థియేటర్లు అలాగే ఉంటాయి. నిర్మాతలుగా మా తొలి ప్రాధాన్యత కూడా థియేటర్లే. ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలతో సినిమాలు చేయాలనుంది. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించే సినిమాను దసరాకు ప్రకటిస్తాం. నాగచైతన్యతో కూడా సినిమా ఉంటుంది. విజయ్ దేవరకొండ బిజీగా ఉండటంతో ఆయనతో సినిమా కుదరడం లేదు. విజయ్‌తో సినిమాకు చాలా సమయం పడుతుంది.