త్రిష అందంగా ఉంటుంది. తెరపై ఆమె యాటిడ్యూడ్ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. ఆ నవ్వు విప్పారిన పొద్దుతిరుగుడుపువ్వులా ఉంటుంది. మొన్నామధ్య వచ్చిన మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో చాలామంది హీరోయిన్లున్నా, అందంలో అందరికంటే ఒకమార్కు ఎక్కువ త్రిషకే పడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే.. నేటికీ పెద్దపెద్ద సినిమాలు ఈ అందాన్నే వరిస్తున్నాయి.
ఇటీవలే తమిళ విజయ్‌కి జోడీగా ఆమె నటించిన ‘లియో’ సినిమా విడుదలై మంచి వసూళ్లే రాబట్టింది. త్వరలో మరో భారీ సినిమాలో నటించనుంది త్రిష. అది కూడా తెలుగు సినిమా. అందునా మెగాస్టార్ సినిమా. అవును.. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో త్రిష ప్రధాన కథానాయికగా ఎంపికైంది. అనుష్క, నయనతార, ఐశ్వర్యరాయ్ ఇలా చాలామంది హీరోయిన్ల పేర్లు ఈ పాత్ర విషయంలో వినిపించాయి. చివరకు త్రిష ఖరారైంది. 18ఏళ్ల క్రితం చిరంజీవితో ‘స్టాలిన్’ సినిమాలో నటించింది త్రిష. మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్‌తో జతకట్టనుంది. మెగా అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.