Congress | ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్ చేశారు. తాను డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుగోలు చేశానని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అతను ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. చిన్నారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో టచ్‌లో ఉంటున్నాడు, అతని ఫోన్, సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయన్నారు. కాగా, మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఏఐసీసీ వద్దకు చేరింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మేఘారెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు.
ఇటీవల తనపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖర్గేకు ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు. తాను డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుగోలు చేశానని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టు మేఘారెడ్డి వెల్లడించారు. పత్రికల్లో వచ్చిన రిపోర్ట్‌తో పాటు చిన్నారెడ్డి వాయిస్‌ను కూడా ఖర్గే ముందు ఉంచినట్టు తెలిపారు. 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కన్నతల్లి వంటి పార్టీపైన చిన్నారెడ్డి విమర్శలు చేశారని మేఘారెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలతో కలిసి పార్టీని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరును అధిష్ఠానం ముందు ఉంచినట్టు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు