‘మజాకా’ వందశాతం హిట్ ఫిల్మ్. దాని రేంజ్ ఏంటి అనేది మాత్రం ఫస్ట్ షో పడ్డాకగానీ డిసైడ్ అవ్వదు. ఇప్పటివరకూ చూసినవారంతా సినిమా సూపర్ అన్నారు. నిర్మాతలు ఉన్నంతలో బెస్ట్ ఎఫర్ట్ పెట్టారు. ఈ మహాశివరాత్రికి కచ్చితంగా మంచి హిట్ అందుకోబోతున్నాం.’ అని దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్నారు. ఆయన దర్శకత్వంలో సందీప్‌కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ కథానాయిక. రావురమేష్, అన్షూ కీలక పాత్రధారులు.
రాజేష్ దండా నిర్మాత. బుధవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు త్రినాథరావు నక్కిన. ‘రైటర్ ప్రసన్న ‘థమాకా’ టైమ్‌లో ఈ కథ చెప్పాడు. రావురమేష్‌ని దృష్టిలో పెట్టుకొని కథ చెప్పడంతో హీరోగా ఎవరు చేస్తారు? అనడిగాను. అన్నట్టుగానే ఈ కథ చాలామంది దగ్గరకు తిరిగింది. చివరకు రావురమేష్ కాంబినేషన్లోనే సందీప్‌తో ఖాయమైంది. నిజానికి ఈ కథని సందీప్‌కిషన్ ఒప్పుకోవడం గ్రేట్.’ అని చెప్పారు త్రినాథరావు.
‘ఇది ఓ తండ్రీకొడుకుల కథ. ఫుల్ ఫన్ జోన్లో ఉంటుంది. చివరి 20నిమిషాలు మాత్రం ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్‌తో వచ్చాడు ప్రసన్న. లొకేషన్లో చిన్నచిన్న డైలాగ్ మార్పులు తప్ప.. ఇక అందులో వేలు పెట్టలేదు.’ అని త్రినాథరావు తెలిపారు. సందీప్‌కిషన్, రావురమేష్, రీతూవర్మ, అన్షూ.. తమ పాత్రలకు ప్రాణం పోశారని, ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ తీసుకొచ్చిందని, సాంకేతికంగా కూడా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని త్రినాథరావు చెప్పారు.
ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉందని, అందుకే ‘డబుల్ మజాకా’ అని ఎండింగ్లో టైటిల్ వేశామని, అలాగే రవితేజ ‘ధమాకా’ను కూడా ‘డబుల్ ధమాకా’గా సీక్వెల్ చేస్తే బావుంటుందని, ఆ ప్రయత్నంలోనే ఉన్నానని త్రినాథరావు చెప్పారు.