Toxic Controversy | కన్నడ స్టార్ నటుడు యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ చిత్రం ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టీజర్లో అశ్లీలతతో పాటు అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ ఈ ఫిర్యాదులో పేర్కొంటూ.. టీజర్‌లోని దృశ్యాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయని, తక్షణమే ఈ టీజర్‌ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ వెంటనే రంగంలోకి దిగింది. టీజర్‌లోని అభ్యంతరకర దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. అంతేకాకుండా, దీనిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ‘ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ చిత్ర గ్లింప్స్‌లో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అయితే ఈ విమర్శలపై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కాస్త ఘాటుగానే స్పందించారు. ఒక మహిళా దర్శకురాలు అయ్యుండి ఇలాంటి సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు అంటూ వస్తున్న కామెంట్లను చూసి తాను ఏమాత్రం ఆశ్చర్యపోవడం లేదని, ఆ విమర్శలను తాను చాలా తేలిగ్గా తీసుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు.