కన్నడ అగ్ర నటుడు యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగుతున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జాన్విక్, డే షిప్ట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీని అందించిన జె.జె.పెర్రీ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇప్పటివరకు అబ్బురపరిచే పోరాట ఘట్టాలను తెరకెక్కించామని, ముంబయిలో 45 రోజుల పాటు జరిగే సుదీర్ఘ షెడ్యూల్లో మరికొన్ని యాక్షన్ సీక్వెన్స్‌కు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ‘నా 35ఏళ్ల కెరీర్లో ఎన్నో దేశాల్లో పనిచేశాను. భారతీయ సినిమాలు క్రియేటివ్‌గా ఉంటాయి. ఇక్కడి సినిమాలకు నేను పెద్ద అభిమానిని. ‘టాక్సిక్’ కోసం రూపొందించే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా వినూత్నంగా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కించబోతున్నాం’ అన్నారు జె.జె.పెర్రీ. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదలకానుంది.