Tollywood Producer TG Vishwa Prasad | తెలుగు సినీ పరిశ్రమపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి. మలయాళంలో కోటి రూపాయలతో నిర్మించే సినిమా.. తెలుగులోకి వచ్చేసరికి రూ. 15 కోట్లకు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. మలయాళంలో కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో తీసే సినిమా, తెలుగులో తీయాలంటే రూ.15 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో తెలిసిన నిర్మాతకి అయితే రూ. 4 కోట్లు అయ్యే చిత్రం తెలియని నిర్మాతకు రూ.15 కోట్లు అవుతుందని తెలిపాడు. దీనికి కారణం మలయాళంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు తక్కువగా ఉండటమేనని పేర్కొన్నారు. అయితే అదే కథతో తెలుగులో సినిమా తీయాలంటే చాలా ఖర్చు అవుతుందని.. నటీనటుల భారీ రెమ్యునరేషన్లు, టెక్నికల్ టీమ్‌ల అధిక జీతాలు, అలాగే షూటింగ్లో పనిచేసే కార్మికుల వేతనాలు కూడా ఎక్కువగా ఉండటంతో బడ్జెట్ భారీగా పెరుగుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండస్ట్రీలో ఒక పద్ధతి ప్రకారం పారితోషికాలను నిర్ణయించాలని విశ్వప్రసాద్ సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సినీ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విశ్వప్రసాద్ చెప్పిన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరూ వ్యతిరేకిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. పీపుల్ మీడియా ఫ్యాకర్టీ బ్యానర్లో వస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ కథానాయకుడిగా రాబోతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.