నటీనటులు : రోహిత్, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్, బాల రజ్వాది
దర్శకత్వం : మహి కోమటిరెడ్డి
బేనర్ : అశ్లీ క్రియేషన్స్ బ్యానర్
సంగీతం : ఎంఎల్ రాజా
ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కోవలోనే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన చిత్రం ‘మిస్టీరియస్’. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలకు తోడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాస్యనటుడు బ్రహ్మానందం రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.అయితే మంచి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ
హైదరాబాద్‌లోని కొండపూర్‌కి చెందిన ఎస్.ఐ (SI) రాంఖీ అలియాస్ రామ్ కుమార్ (అబిద్ భూషణ్) అకస్మాత్తుగా అదృశ్యమవుతాడు. ఈ మిస్సింగ్ కేసును ఛేదించే బాధ్యత ఏసీపీ ఆనంద్ సాయి (బాల రజ్వాది) పై పడుతుంది. విచారణలో భాగంగా ఆర్కిటెక్ట్ విరాట్ (రోహిత్ సాహ్ని), అతని భార్య శిల్ప (మేఘన రాజ్‌పుత్)లను ఏసీపీ ప్రశ్నించాల్సి వస్తుంది. అసలు రాంఖీ అదృశ్యానికి, విరాట్ దంపతులకు ఉన్న సంబంధం ఏంటి? విరాట్ కొనుగోలు చేసిన విల్లాలో ఏం జరిగింది? ఈ కథలోకి మిస్సిరా (రియా కపూర్) ఎందుకు ప్రవేశించింది? చివరికి రాంఖీని చంపింది ఎవరు? అనే ఉత్కంఠభరితమైన ట్విస్టులతో సినిమా సాగుతుంది.
విశ్లేషణ:
దర్శకుడు పాతబస్తీ ప్రేమకథల తరహా పాయింట్‌ను తీసుకున్నప్పటికీ, దానికి సస్పెన్స్, థ్రిల్లర్ మరియు హర్రర్ అంశాలను జోడించి కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచే కథలోకి వెళ్లడం వలన ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీలవ్వడు. దీంతో కిల్లర్ ఎవరనే ఉత్కంఠను క్లైమాక్స్ వరకు కాపాడటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా.. సెకండాఫ్‌లో వచ్చే హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.
నటీనటులు:
ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఏసీపీగా బాల రజ్వాది అనుభవజ్ఞుడైన నటుడిలా రాణించారు. జబర్దస్త్ ఫేమ్ రాజమౌళికి ఈ చిత్రంలో మంచి నిడివి ఉన్న పాత్ర లభించింది, దానికి ఆయన పూర్తి న్యాయం చేశారు. గడ్డం నవీన్ కూడా తన పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక వర్గం:
సంగీతం: ఎం.ఎల్. రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేసింది.
సినిమాటోగ్రఫీ: పరవస్తు దేవేంద్ర సూరి తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించారు.
ఎడిటింగ్: ఎడిటింగ్ విషయంలో మరికొంత శ్రద్ధ తీసుకుంటే సినిమా ఇంకాస్త వేగంగా సాగేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
బలాలు & బలహీనతలు: ఎం.ఎల్. రాజా అందించిన సంగీతం, ముఖ్యంగా ఆ మూడు పాటలు సందర్భానుసారంగా ఉండి సినిమాకు బలాన్నిచ్చాయి. అయితే, సినిమాలో నటీనటులు పెద్దగా పరిచయం లేని ముఖాలు కావడం కొంత మైనస్ అయినప్పటికీ, వారి నటనతో ఆ లోటును భర్తీ చేశారు.
తీర్పు:
సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు హర్రర్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారు ‘మిస్టీరియస్’ మూవీని ఒకసారి తప్పకుండా చూడవచ్చు.
బాటమ్ లైన్: ఉత్కంఠభరితమైన ‘మిస్టీరియస్’ ప్రయాణం!
రేటింగ్: 3 / 5