Kiran Kumar | టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కిరణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ (KJQ: King.. Jackie.. Queen) ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తన కలల ప్రాజెక్ట్ థియేటర్లలోకి రావడానికి ముందే దర్శకుడు మరణించడం చిత్ర బృందాన్ని మరియు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
నాగార్జున ‘కేడి’తో గుర్తింపు
కిరణ్ కుమార్ 2010లో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘కేడి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమా అప్పట్లో స్టైలిష్ మేకింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. నాగార్జున లాంటి పెద్ద హీరో తనకు అవకాశం ఇవ్వడం వల్లే తాను దర్శకుడిగా ఎదగగలిగానని కిరణ్ కుమార్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండేవారు. ఇండస్ట్రీలో ఆయనను అందరూ ‘కేకే’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. కాగా.. కిరణ్ కుమార్ మృతి పట్ల టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిని కోల్పోవడం బాధాకరమని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.