Tollywood Controversies 2024 | బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇండియాతో పాటు ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా టాప్‌లో ఉంది తెలుగు సినీ ఇండస్ట్రీ. అయితే అగ్ర పరిశ్రమగా ఒక వెలుగు వెలుగుతున్న టాలీవుడ్‌కి ఈ ఏడాది అసలు కలిసిరాలేదన్న విషయం తెలిసిందే.
నాగార్జునతో, అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు లాంటి అగ్ర నటులతో పాటు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో కుల్చడంతో మొదలైన ఈ వివాదం ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీపై కాంగ్రెస్ నేతలు చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ తరువాత లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడం.. జర్నలిస్ట్‌లపై మోహన్ బాబు దాడి చేయడం.. చివరిగా అల్లు అర్జున్ అరెస్ట్ ఇలా ఒక్కో వివాదం దేనికదే ప్రత్యేకంగా నిలిచింది. అయితే ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన వివాదాలు ఒకసారి చూసుకుంటే..
నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో మొదలు..
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటగా చెరువును కబ్జా చేశారంటూ అగ్ర నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌తో కూల్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. నేను ఏ చెరువును ఆక్రమించి కట్టలేదు. ఈ విషయంలో న్యాయం దొరికేవరకు పోరాడతాను అంటూ నాగార్జున వెల్లడించాడు. ఈ వివాదం ముగియకముందే అతడి ఫ్యామిలీపై అటాక్ చేశారు కాంగ్రెస్ నాయకులు
అక్కినేని ఫ్యామిలీపై కొండ సురేఖ వ్యాఖ్యలు
అయితే ఈ వివాదం సద్దుమణగకముందే.. అక్కినేని ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేసింది అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. నటులు నాగ చైతన్య, ఆయన మాజీ భార్య సమంతల విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కారణమని ఆమె ఆరోపించింది. అంతేగాకుండా.. కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా ఈ వివాదంలోకి లాగారు. అయితే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ పరిశ్రమ మొత్తం కొండ సురేఖపై దుమ్మెత్తిపోసింది. అగ్ర నటులు చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. దాంతో దిగొచ్చిన మహిళా మంత్రి అక్కినేని కుటుంబానికి, సమంతకు క్షమాపణలు తెలిపింది. ఈ విషయంపై నటుడు నాగార్జున అక్టోబర్ 4న మంత్రిపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతుంది.
బెంగుళూరు రేవ్ పార్టీ.. హేమ అరెస్ట్
బెంగుళూరు రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీని బెంగుళూరు జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేయగా.. ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి 150 మందికి హాజరు అయినట్లు సమాచారం. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ డీజే సౌండ్ రావడంతో పొరుగు వారు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాగా.. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు తనిఖీల్లో ఎండీఎంఏ పిల్స్, కొకైన్, హైడ్రో గాంజా సహా మరికొన్ని మత్తు పదార్థాలు గుర్తించినట్లు తెలిపారు. అయితే రేవ్ పార్టీలో నటి హేమ (Hema) పాల్గొన్నట్లు బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. దీంతో రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేయగా.. కొన్ని రోజుల అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చింది.
జానీ మాస్టర్
జనసేన పార్టీ మాజీ కార్యకర్త.. ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో టాలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏం జరిగిందంటే.. 2017లో టీవీ షోలో పాల్గోన్న ఒక మహిళ కొరియోగ్రాఫర్‌తో జానీ మాస్టర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే జానీ తన టీంలో తీసుకున్నాడని.. నేను మైనర్‌గా ఉన్న సమయంలోనే ఒక హోటల్లో జానీ తనపై హత్యాచారానికి పాల్పడ్డాడు అని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు సెప్టెంబర్‌లో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఐపీసీ 376, 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో ప్రోడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు. రీసెంట్గా జాతీయ అవార్డుల నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు బెయిల్ కావాలని కోర్టును కోరగా.. బెయిల్ మంజూరు చేసింది. అయితే అవార్డును క్యాన్సిల్ చేసింది జాతీయ అవార్డుల కమిటీ. అనంతరం బెయిల్ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు జానీ. అయితే రెగ్యూలర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి అక్టోబర్ 24న బెయిల్‌ను మంజూరు చేసింది.
రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మాణిలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకుగాను మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంలో వర్మ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు.
మంచు ఫ్యామిలీ వివాదం
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ కుటుంబాలలో మంచు ఫ్యామిలీ ఒకటి. తాజాగా ఈ ఫ్యామిలీ వారి కుటుంబ సమస్యలతో వార్తల్లో నిలిచింది. నటుడు మంచు మోహన్ బాబు అతని కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటిపైకి బౌన్సర్లతో వెళ్లి దాడి చేశాడు మంచు మనోజ్. అయితే ఈ గొడవల (Manchu Family issue) జరుగుతున్న నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) జర్నలిస్ట్‌పై దాడి చేశాడు. ఈ దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పోందుతుండగా.. ఈ ఘటనతో ఆగ్రహించిన జర్నలిస్ట్ సంఘాలు.. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో దాడి ఘటనలో గాయపడిన జర్నలిస్ట్‌కు మోహన్‌బాబు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. కుటుంబ వివాదం ఘర్షణకు దారి తీసినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ సోదరుడు గాయపడటం తనకు బాధ కలిగించిందని అన్నారు. అయితే మీడియాపై మోహన్ బాబు (Mohan Babu) దాడి కేసు సర్వత్రా చర్చనీయాంశమవడమే కాకుండా ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది.
Allu Arjun | అల్లు అర్జున్ అరెస్ట్
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే కేసు నమోదు చేయగా.. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్‌గుడా జైలుకు తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు రూ. 50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో ఆయన రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయ్యారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ అరెస్ట్‌కు సంబంధించి శుక్రవారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. బన్నీ ఒక ఈవెంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడని అందుకు అతడిని టార్గెట్ చేసి ఈ కేసులో ఇరికించారని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.
ఈ అరెస్ట్‌పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా స్పందిస్తూ.. జాతీయ పురస్కారం అందుకున్న ఒక నటుడిని అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను.. కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు.