Shraddha Kapoor | బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ‘సాహో’తో టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితమే. ‘ఆశికీ-2’తో యువత మతులు చెదరగొట్టిన శ్రద్ధ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేండ్లు దాటిపోయింది. గ్లామర్‌తోపాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రద్ధ పంచుకున్న పర్సనల్ కబుర్లు ఇవి..
తీరిక కుదరాలే గానీ.. మా కుక్కపిల్ల షైలోతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తా. ఆ తర్వాతే మరేదైనా! బ్లాస్ట్ మ్యూజిక్ వింటూ రూమ్‌లో డ్యాన్స్ చేయడం నా కాలక్షేపాల్లో ఒకటి.
అప్పుడప్పుడూ మనతో మనం ఉండటం కన్నా.. మనవారితో ఉండటంలోనే ఎక్కువ ఆనందం ఉందనిపిస్తుంటుంది. బాగా ఆలోచిస్తే అదే నిజం! సిరిసంపదల కన్నా అనుబంధాలే ప్రధానం.
గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి… ఫ్యాషన్ ట్రెండ్స్ పాటించక తప్పడం లేదు! కాలేజ్ డేస్‌లో నన్ను చూస్తే ఈ అమ్మాయికి అసలు ఫ్యాషన్‌కు స్పెల్లింగ్ కూడా రాదేమో అనుకునే వాళ్లేమో. నాకు నచ్చినట్టుగా ఉండేదాన్ని. కాలేజీ రోజుల్లో అమ్మమ్మ బంగారు గాజులు వేసుకునేదాన్ని. నా స్నేహితులు వింతగా చూసేవాళ్లు. అయినా, వాటితో నాకున్న అనుబంధం అలాంటిది. అందుకే ఎవరేమనుకున్నా… తీసేయాలనే ఆలోచన కూడా నాకు వచ్చేదికాదు.
జీవితం ఆడుతూపాడుతూ సాగిపోవాలని అందరూ కోరుకుంటారు. అలా ఉండాలనుకోవడం తప్పుకాదు! జీవితంలో ఫాంటసీలు ఉండాలి కానీ, ఫాంటసీలే జీవితం కావొద్దు. అన్ని పరిస్థితులూ ఒకేలా ఉండవు కదా! ఊహల్లోనే విహరిస్తుంటే.. వాస్తవం ఏంటో ఎప్పటికీ అర్థం కాదు.
ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు సమస్య మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఏ కోణంలో దాన్ని పరిష్కరించవచ్చో ఆలోచిస్తాను. నా శక్తియుక్తులన్నీ ఉపయోగించి దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాను.
నేను సినిమాల్లోకి వస్తానంటే నాన్న (శక్తికపూర్) ఎంతో ప్రోత్సహించారు. ఒక యాక్టర్‌గా ఎలా ఉండాలో చెప్పారంతే! అంతేకానీ, సినిమా కథ వినడం, ఓకే చెప్పడం ఇలాంటివి ఎన్నడూ చేయలేదు. నేను సరైన నిర్ణయం తీసుకోగలనని ఆయన నమ్మకం. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నేను ఎంపిక చేసుకున్నవే!