Wamiqa Gabbi | ‘భలే మంచిరోజు’ అని తెలుగువారిని పలకరించిన పంజాబీ ముద్దుగుమ్మ వామికా గబ్బీ గుర్తుందా? తెలుగులో చేసింది ఒక చిత్రమే అయినా.. ఇంతింత కన్నులేసుకున్న ఆ ఇంతిని అలా ఎలా మర్చిపోగలం అంటారు కదా! ఆ సోగకళ్ల సుందరి ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఓటీటీ దర్శకనిర్మాతలూ ఆమెకే ఓటేస్తున్నారు. బీటౌన్‌లో బిజీబిజీగా ఉన్న వామికా తన సినిమా జర్నీ గురించి ఇలా పంచుకుంది…
షాహిద్ కపూర్, కరీనా కపూర్ జోడీగా నటించిన ‘జబ్ వి మెట్’ నా మొదటి సినిమా! అందులో చిన్న పాత్ర పోషించా. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా! షూటింగ్ ఉంది అనగానే ఎంచక్కా స్కూల్‌కు డుమ్మా కొట్టొచ్చని ఎగిరి గంతేసేదాన్ని. షాట్ గ్యాప్‌లో కరీనా, షాహిద్‌తో మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఇద్దరూ నన్ను చాలా గారాబం చేసేవాళ్లు! ఆ షూటింగ్ జరిగినన్ని రోజులూ హ్యాపీగా అనిపించింది.
‘జబ్ వి మెట్’ తర్వాత నాలుగైదు చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు చేశాను. తర్వాత హిందీ సినిమా ‘సిక్స్టీన్’తో హీరోయిన్గా పరిచయమయ్యాను! నా మాతృభాష పంజాబీలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పట్లో నాకు బాలీవుడ్లో మళ్లీ చాన్సులు వస్తాయని అస్సలు ఊహించలేదు. అందుకే పంజాబీ చిత్రసీమలో సెటిల్ అవుదామని ఫిక్సయ్యా! సినిమాను కెరీర్‌గా కూడా అనుకోలేదు. కెమెరా ముందు కనిపించడం అంటే సరదా! అదే నన్ను పరిశ్రమలో ఇంకా కొనసాగేలా చేసింది.
Wamiqa Gabbi1
పంజాబీ చిత్రాలు చేస్తున్నప్పుడే అనుకోకుండా తెలుగు సినిమా ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. నాకేమో తెలుగు రాదు! చాలా కష్టపడాల్సి వచ్చింది. తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించాను. తర్వాత బాలీవుడ్ చాన్సులు పలకరించాయి. దీంతో బిజీ అయిపోయాను. ఓటీటీ అవకాశాలూ వచ్చాయి. మొత్తంగా నా కెరీర్ వేగం పుంజుకుంది. నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను.
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ‘గ్రహణ్’ నా మొదటి వెబ్‌సిరీస్. 1984లో సిక్కులపై జరిగిన మారణహోమం నేపథ్యంలో దీన్ని నిర్మించారు. ఇందులో నేను పోషించిన మను పాత్ర మంచిపేరు తెచ్చిపెట్టింది. ఈ పాత్ర వ్యక్తిగతంగా నన్ను ఎంతగానో మార్చింది. అమాయకత్వం, ఉన్నత విలువలు ఆమెను ప్రత్యేకంగా చూపిస్తాయి. కథే అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒత్తిడికి గురికాని మను వ్యక్తిత్వం ప్రతి స్త్రీకి ఆదర్శమే కదా!
ఇటీవల ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించిన ‘జూబ్లీ’ వెబ్‌సిరీస్‌లో మంచి పాత్ర పోషించాను. మొదట్లో ఈ ఆఫర్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యాను. అయితే నిర్మాణ సంస్థ అదనపు కాల్షీట్లు అడిగింది. కుదరదని చెప్పాను. అలా ఆఫర్ దాదాపు చేజారిపోయింది. ఇంతలో కరోనాతో ఓ ఏడాది షూట్ ఆగిపోయింది. ఏడాది తర్వాత మళ్లీ పిలుపొచ్చింది. అది ఎంత హిట్టో, ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందేగా!
ఫాంటసీ ప్రపంచంలో విహరిస్తూ ఉంటా! గాల్లో ఎగిరిపోయినట్టు, గమ్మత్తుగా యుద్ధాలు చేసినట్టు ఇలా ఊహల్లో ఏవేవో వస్తుంటాయి. నా చేతులకు మ్యాజిక్ చేసే శక్తి రావాలనుకుంటా. మీకు చిత్రంగా అనిపించొచ్చు. అవి అసాధ్యమని నాకూ తెలుసు. కానీ, అలా అనుకోవడంలో తప్పులేదు కదా!