‘ఆరేండ్ల పిల్లాడి నుంచి 60ఏండ్ల వారివరకూ అందరినీ ఆకట్టుకునే సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ఇది యూత్ కోసమే చేసిన సినిమా కాదు. ఆడియన్సందరికీ కనెక్టయ్యేలా ఉంటుంది. థియేట్రికల్ రిలీజ్‌కి కారణమదే.’ అన్నారు హీరో మౌళి తనుజ్. తను, శివాని నాగరం జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘లిటిల్ హార్ట్స్’. సాయిమార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వారా తెలుగు రాష్ర్టాల్లో నేడు సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మౌళి తనుజ్ విలేకరులతో మాట్లాడారు. ‘రైటర్, డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. బీటెక్ చదువుతూనే షార్ట్‌ఫిల్మ్స్ చేసేవాడ్ని. అప్పుడే ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా. ఈ ప్రాసెస్‌లోనే స్క్రిప్ట్‌పై అవగాహన తెచ్చుకున్నా. ఇక్కడికొచ్చాక అనుకోకుండా ‘90s మిడిల్‌క్లాస్ బయోపిక్’తో నటుడ్నయ్యాను.’ అని మౌళి తనుజ్ పేర్కొన్నారు.
బన్నీవాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగిందన్నారు మౌళి తనూజ్. ప్రమోషనల్ కంటెంట్ కారణంగా ఈ బ్యాచ్ నవ్విస్తారనే నమ్మకం ఆడియన్స్‌కి కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌కి సంబంధించిన స్క్రిప్ట్ సైడ్ తాను వర్క్ చేశానని, దర్శకుడ్ని కావాలనే కలను భవిష్యత్తులో తప్పక నెరవేర్చుకుంటానని మౌళి తనుజ్ చెప్పారు. తల్లిదండ్రులతో కలిసి చూసేంత మంచి సినిమాలే చేస్తానని, తాను రాసే స్క్రిప్ట్స్ కూడా అలాగే ఉంటాయని, ‘లిటిల్ హార్ట్స్’ చూశాక మంచి సినిమా చూశామనే అనుభూతిని ప్రేక్షకులు పొందుతారని మౌళి తనుజ్ నమ్మకం వ్యక్తం చేశారు.