Tigmanshu Dhulia | బాలీవుడ్లో విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు, నటుడు తిగ్మాన్షు ధులియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘హాసిల్’, ‘పాన్ సింగ్ తోమర్’ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఆయన.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో కొనసాగుతున్న ట్రెండ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారీ విజయాలు సాధించిన ‘కేజీఎఫ్’, ‘పుష్ప’, ‘ధురంధర్’ వంటి సినిమాల కథనాలపై తిగ్మాన్షు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ సినిమాలు ఒకే తరహా టెంప్లేట్లో రూపొందుతున్న ‘ఫిక్షనల్ బయోపిక్స్’లా ఉన్నాయని.. వాటిలో కొత్త కథల కొరత కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో తిగ్మాన్షు ధులియా ఇండియన్ సినిమా ప్రస్తుత పరిస్థితిపై తన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ‘ధురంధర్’ సినిమా ప్రెజెంటేషన్, సంగీతం, టేకింగ్ అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించినప్పటికీ.. సినిమాలో అసలు కథ ఏముందని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక భారతీయ స్పై అండర్‌కవర్ ఏజెంట్‌గా పాకిస్థాన్‌లోకి వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించడం మాత్రమే కథ అయితే.. దాన్ని పూర్తిస్థాయి కథగా ఎలా పరిగణించాలంటూ ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ వంటి సినిమాలపైనా ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల్లో కొత్త కథల కంటే ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమైన టెంప్లేట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత సినిమా రంగంపై కార్పొరేట్ కల్చర్, ఎక్స్ట్రీమ్ క్యాపిటలిజం ప్రభావం ఎక్కువైందని తిగ్మాన్షు అభిప్రాయపడినట్లు సమాచారం. కొత్త తరహా కథలు చెప్పాలనుకునే రచయితలు, దర్శకులు ఉన్నప్పటికీ.. వాటిని తెరకెక్కించేందుకు పరిశ్రమలో తగిన అవకాశాలు లభించడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో రిస్క్ తీసుకోవడానికి నిర్మాణ సంస్థలు వెనుకాడుతున్నాయని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే విజయవంతమైన ఫార్ములాలు, స్టార్ ఇమేజ్, భారీ యాక్షన్, విజువల్ గ్రాండియర్ వంటి అంశాల చుట్టూనే ఎక్కువ సినిమాలు తిరుగుతున్నాయనే ఆయన వాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.