చూస్తుండగానే మరో ఏడాది చివరికి వచ్చేసింది. కేవలం ఇంకో వారం రోజుల్లోనే కొత్త క్యాలెండర్ రాబోతుంది. మరి 2022లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఏది ఎక్కువగా విజయం సాధించింది.. వేటికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.. 2022లో దాదాపు 100 సినిమాలు విడుదలయ్యాయి. మరి అందులో టాప్ సినిమాలు ఏంటి? 2021తో పోలిస్తే ఈ ఏడాది విజయాల శాతం పెరిగిందా తగ్గిందా..? ఈ సంవత్సరం వచ్చిన టాప్ హిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
RRR:
2022లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా.. అన్నిటి కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా మాత్రం ట్రిపుల్ ఆర్. రాజమౌళి సినిమా వచ్చింది అంటే.. ఆ సంవత్సరానికి అదే అగ్ర పీఠం సాధిస్తుందని గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 300 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా.
కార్తికేయ 2:
ట్రిపుల్ ఆర్ తర్వాత కలెక్షన్ల పరంగా అత్యధిక వసూలు సాధించిన మరో సినిమా ‘కార్తికేయ 2’. నిఖిల్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 18 కోట్ల బిజినెస్ చేసిన కార్తికేయ సీక్వెల్ ఏకంగా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీలోనే 40 కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా. నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు 60 కోట్లకు పైగా లాభాలు మిగిల్చి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘కార్తికేయ 2’.
మేజర్:
అడవి శేష్ హీరోగా వచ్చిన ‘మేజర్’ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది. సరికొత్త కథలతో ఎప్పుడు విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న శేష్.. ఈ ఏడాది కూడా రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా వచ్చిన మేజర్ సినిమా.. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. దాదాపు 40 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమాతోనే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు అడవి శేష్.
బంగార్రాజు:
ది ఘోస్ట్ సినిమాతో నిరాశ పరచినా.. 2022 ని మాత్రం ‘బంగార్రాజు’ సినిమాతో అద్భుతంగా మొదలు పెట్టాడు నాగార్జున. నిజానికి సంక్రాంతికి ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధే శ్యామ్’ లాంటి సినిమాలు వస్తాయని అనౌన్స్ చేశారు నిర్మాతలు. కానీ కరోనా థర్డ్ వేవ్ రావడంతో.. వస్తాయనుకున్న సినిమాలన్నీ వాయిదా పడ్డాయి దాంతో చివరికి నాగార్జున మాత్రమే వచ్చాడు. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘బంగార్రాజు’ దాదాపు 37 కోట్లు వసూలు చేసి మంచి విజయం అందుకుంది.
సీతా రామం:
2022లో వచ్చిన మరో క్లాసిక్ హిట్ ‘సీతారామం’. పది సంవత్సరాల కింద ‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా మారిన హను రాఘవపూడి.. ఈ ఏడాది సీతారామం సినిమాలో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. విజయం కంటే ఎక్కువగా ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2022 లో కూడా ప్యూర్ లవ్ స్టోరీ చెప్పి.. మరికొన్ని దశాబ్దాల వరకు ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్లాసిక్ అందించాడు ఈయన. వైజయంతి మూవీస్ నిర్మించిన సీతారామం దాదాపు 42 కోట్ల షేర్ వసూలు చేసింది.
బింబిసార:
2022లో ఆగస్టు నెల టాలీవుడ్ కి బాగా కలిసి వచ్చింది. ‘సీతారామం’ సినిమా విడుదలైన రోజే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ‘బింబిసారా’ 33 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. సోషల్ ఫాంటసీగా వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు దాదాపు ఏడేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ అందించింది. దీనికి సీక్వెల్ కూడా చేస్తున్నామని ప్రకటించారు దర్శక నిర్మాతలు.
DJ టిల్లు:
ఈ ఏడాది వచ్చిన మరో ప్యూర్ బ్లాక్ బస్టర్ డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 4 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ లో 12 కోట్లకు పైగా వసూలు చేసి బయ్యర్లకు మూడింతలు లాభాలు తీసుకొచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ కూడా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రవితేజ ఖిలాడితో పాటు విడుదలైన ఈ సినిమా.. దాన్ని రేసులో కూడా లేకుండా చేసింది.
హిట్ 2:
‘మేజర్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న అడవి శేష్.. ఆరు నెలలు తిరక్కముందే మరో సూపర్ హిట్ అందుకున్నాడు. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై వచ్చిన హిట్ 2 దాదాపు 27 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా.. అంచనాలు అందుకొని అద్భుతమైన విజయం సాధించడమే కాదు.. అడవి శేష్ కు డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.
ఒకే ఒక జీవితం, యశోద, మసూద:
2022 శర్వానంద్ కు బాగా కలిసి వచ్చింది. ఏడాది మొదట్లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో వచ్చి ప్లాప్ అందుకున్న ఈయన.. చివర్లో మాత్రం ‘ఒకే ఒక జీవితం’ అంటూ ఒక మంచి విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఆరు కోట్ల బిజినెస్ చేసిన ఒకే ఒక జీవితం 11 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది. అలాగే సమంత ‘యశోద’ కూడా 12 కోట్ల బిజినెస్ చేస్తే 14 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. చిన్న సినిమాలుగా వచ్చిన ‘మసూద’, సుడిగాలి సుదీర్ ‘గాలోడు’ కూడా మంచి కలెక్షన్స్ సాధించి గెలుపు బాట పట్టాయి. మొత్తానికి గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం విజయాల శాతం బాగానే పెరిగింది.
గెలుపు ఉన్నప్పుడు ఓటమి కూడా కామన్. అలాగే విజయాలు ఉన్నప్పుడు అపజయాలు కూడా సాధారణమే. 2022లో కూడా ఎప్పటిలాగే విజయాల కంటే అపజయాలు డామినేట్ చేశాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కొన్ని పాన్ ఇండియా సినిమాలు దారుణంగా నిరాశ పరచడంతో.. నష్టాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. మరి ఈ ఏడాది అంత దారుణంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన డిజాస్టర్స్ ఏంటో చూద్దాం..
డిజాస్టర్ సినిమాలు:
రాధే శ్యామ్:
2002లో ఎన్ని సినిమాలు వచ్చినా.. అన్నింటి కంటే అతి పెద్ద డిజాస్టర్ మాత్రం ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో చేసింది. కానీ కలెక్షన్స్ మాత్రం 100 కోట్లు కూడా దాటలేదు. నష్టాల పరంగా చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది రాధే శ్యామ్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 80 కోట్లకు పైగా నష్టాలు మిగిలింది ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
లైగర్:
ఈ ఏడాది వచ్చినా మరో అతిపెద్ద డిజాస్టర్ ‘లైగర్’. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ దారుణంగా ఫ్లాప్ అయింది. దేశమంతా తిరిగి ప్రమోషన్ చేసుకున్న కూడా సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో మొదటి రోజే తేలిపోయింది. సినిమాపై ఉన్న అంచనాలు.. విజయ్ దేవరకొండ క్రేజ్ తో మొదటి రోజు దాదాపు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు నుంచి చేతులెత్తేసింది. దాదాపు 60 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది లైగర్ సినిమా. తెలుగు తమిళం హిందీ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి ఇండస్ట్రీలో దారుణంగా నిరాశ పరిచింది లైగర్.
ఆచార్య:
తొమ్మిదేళ్ల తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలతో ఓకే అనిపించాడు. కానీ 2022 మాత్రమే ఈయన అసలు మర్చిపోలేడు. ఎందుకంటే రామ్ చరణ్ తో మొదటిసారి కలిసిన ‘ఆచార్య’ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. అపజయం ఎరుగని కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా దాదాపు 70 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్లు గొడవ కూడా చేశారు. తీసుకున్న రెమ్యూనరేషన్ లో కొంత భాగం చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్ వెనక్కివ్వాల్సి వచ్చింది. ఆచార్య ఫ్లాప్ అయినందుకంటే కొడుకుతో నటించిన మొదటి సినిమా ఆడకపోవడంతో ఎక్కువగా ఫీల్ అయ్యాడు చిరంజీవి. దీంతో పాటు దసరాకు విడుదలైన ‘గాడ్ ఫాదర్’ కూడా కమర్షియల్ గా సేఫ్ కాలేదు.
అంటే సుందరానికి:
గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’ తో మంచి విజయం అందుకున్న నాని.. 2022లో మాత్రం మరోసారి ఫ్లాప్ బాట పెట్టాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ లో ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత నాని నటించిన సినిమా ఇది. మిగిలిన హీరోలందరికీ బాగానే హిట్స్ ఇచ్చిన మైత్రి నానికి మాత్రం ఇప్పటివరకు విజయం అందించలేకపోయింది. అంటే సుందరానికి థియేటర్లలో ఫ్లాప్ అయిన ఓటీటీలో మాత్రం మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో మలయాళ హీరోయిన్ నజరియా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 10 కోట్ల నష్టాలు మిగిల్చింది అంటే సుందరానికి.
ది వారియర్:
రామ్ పోతినేని కూడా ఏడాది ‘ది వారియర్’ రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు. లింగుస్వామి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేరోజు విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్ రెండు భాషల్లోనూ నిరాశపరిచింది. దాదాపు 20 కోట్లకు పైగా నష్టాలు తీసుకువచ్చింది ఈ సినిమా. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.
మాచర్ల నియోజకవర్గం:
నితిన్ కష్టాలు ఏడాది కూడా కంటిన్యూ అయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈ హీరో.. 2022లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో వచ్చాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చినా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ కథా కథనాలతో వచ్చిన మాచర్ల నియోజకవర్గం రెండో రోజే థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది. ది వారియర్ తర్వాత కృతి శెట్టికి మాచర్ల మరో డిజాస్టర్ గా నిలిచింది. వీటితో పాటు ఈ ఏడాది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మరో డిజాస్టర్ లో కూడా నటించింది కృతి శెట్టి.
ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ:
2021 సంక్రాంతికి క్రాక్ సినిమాతో అదిరిపోయే హిట్టు కొట్టిన రవితేజ.. అదే జోరు ఈ ఏడాది కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది ఆయన నుంచి మూడు సినిమాలు వచ్చాయి. ఫిబ్రవరిలో విడుదలైన ‘ఖిలాడి’.. డిస్టిబూటర్లకు దాదాపు 11 కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది. అలాగే జూన్ లో విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా కనీసం 10 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేదు. ఇక ఏడాది చివర్లో ‘ధమాకా’ సినిమాతో వస్తున్నాడు రవితేజ. త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమా ఫలితం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
పక్కా కమర్షియల్:
2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత మరో విజయం లేని గోపీచంద్.. ఈ ఏడాది మారుతి తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొడతాను అని నమ్మకంగా చెప్పిన గోపి ఆశలను పక్కా కమర్షియల్ దారుణంగా దెబ్బ కొట్టింది. రొటీన్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు తిప్పి కొట్టారు. దాంతో గోపీచంద్ మరోసారి ఫ్లాప్ రుచి చూడాల్సి వచ్చింది. నాగార్జున ‘ది ఘోస్ట్’, శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలు కూడా అంచనాలు అందుకోలేదు.
గని, రంగ రంగ వైభవంగా:
మెగా కుటుంబంలో ఒక్క రామ్ చరణ్ తప్ప 2022లో ఎవరు విజయం అందుకోలేకపోయారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఘని’ కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. దాంతో పాటు ‘ఎఫ్3’ సినిమా కూడా యావరేజ్ దగ్గర ఆగింది. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ 4 కోట్లు కూడా వసూలు చేయలేక డిజాస్టర్ గా నిలిచింది. నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా ప్రేక్షకులకు గుర్తులేదు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. గతేడాది ‘నాంది’ సినిమాతో మంచి విజయం అందుకున్న అల్లరి నరేష్.. ఈ ఏడాది ఇ’ట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో వచ్చాడు. దీనికి టాక్ బాగానే వచ్చిన కలెక్షన్స్ మాత్రం రాలేదు. ‘విరాటపర్వం’ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.. కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు.
జిన్నా, సన్ ఆఫ్ ఇండియా:
మంచు కుటుంబానికి 2022 మరోసారి చేదు జ్ఞాపకాలని మిగిల్చింది. మోహన్ బాబు 5 ఏళ్ల తర్వాత హీరోగా నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా ఘోరాతి ఘోరంగా నిరాశపరిచింది. ఈ సినిమా కనీసం కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయలేదు. మరోవైపు మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమాకు ఇదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి తిరస్కారం లభించింది. సన్నీ లియోన్ పేరు చెప్పి ప్రమోషన్ చేసుకున్న పని మాత్రం జరగలేదు. వీటితో పాటు మరికొన్ని డిజాస్టర్స్ కూడా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కనీసం 2023లో అయినా ఈ అపజయాల శాతం తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.