Akshay Kumar Movies | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. కోవిడ్‌కు ముందు వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షయ్.. కోవిడ్ తర్వాత ఫామ్‌ను కోల్పోయాడు. కరోనా తర్వాత ఈయన నటించిన 9 సినిమాలు రిలీజయ్యాయి. అందులో రెండు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. కాగా మిగిలిన ఏడింటిలో ఒక్కటి మాత్రమే కమర్షియల్‌గా హిట్ సాధించింది. మిగితావన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. దాంతో ఈయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అయితే ఫలితం ఎలా ఉన్నా అక్షయ్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజను సినిమాలున్నాయి.
ఈ ఏడాది ఐదు సినిమాలను రిలీజ్ చేసిన అక్షయ్.. వచ్చే ఏడాది ఏకంగా ఆరు సినిమాలను ప్లాన్ చేశాడు. ఈ ఆరు సినిమాల్లో రెండు షూటింగ్ పూర్తి చేసుకోగా, నాలుగు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా అక్షయ్ వచ్చే ఏడాదిని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రతి రెండు నెలలకు ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలో షూటింగ్‌లను వేగ వంతం చేస్తున్నాడట. ఇదే గనుక జరిగితే నెక్ట్స్ ఇయర్ కూడా అక్షయ్ కుమార్ సినిమాలతోనే బాలీవుడ్ క్యాలెండర్ నిండి ఉంటుంది.
ఇక ఆ ఆరు సినిమాల్లో రెండు రీమేక్ సినిమాలు కావడం విశేషం. అందులో ఒకటి ‘ఆకాశం నీ హద్దురా’ కాగా, మరొకటి మలయాళ సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈయన నటిస్తున్న మారాఠి సినిమా వేదాంత్ మారాఠే వీర్ దౌడలే సాత్ నుండి అక్షయ్‌కుమార్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీగా కనిపించనున్నాడు.