‘ప్రేమలో ఉంటే ఆ బంధాన్ని నిలుపుకోవడానికి చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తగినంత సమయాన్ని కేటాయించాలి. ప్రస్తుతం నేను సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నా. ప్రేమించే అంత టైమ్ లేదు’ అని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో కూడా సత్తా చాటుతున్నది. ‘పుష్ప’ చిత్రంతో దేశవ్యాప్తంగా యువతకు చేరువైన ఈ అమ్మడు నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. ‘మిమ్మల్ని నేషనల్ క్రష్ అంటారు కదా.. ప్రేమ మీద మీ అభిప్రాయమేమిటి?
ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా? అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించగా..పైవిధంగా సమాధానమిచ్చింది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో గడపడానికే సమయం చిక్కడం లేదని, ఇక ప్రేమ వ్యవహారాలకు టైమ్ ఎక్కడిదంటూ ఎదురు ప్రశ్నించిందీ సుందరి. రష్మిక మాట్లాడుతూ ‘ప్రేమను నిలబెట్టుకోవడం అంత సులభం కాదు.
అందుకు చాలా సహనం కావాలి. టైమ్ కూడా చాలా ముఖ్యం. ఇప్పటికే ఇంట్లో అందుబాటులో ఉండటం లేదని మా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతుంటారు. ఇప్పుడైతే నేను ఏ రిలేషన్లో లేను. ఎవరినైనా ప్రేమిస్తే నేనే ఆ విషయాన్ని ముందుగా వెల్లడిస్తా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నది.