‘కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తీ ఫ్యామిలీస్టారే అనేదే ఈ సినిమా కథ. మీలోనూ ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీస్టార్ అవ్వాలనుకుంటారు’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. మృణాల్‌ఠాకూర్ కథానాయిక. ఈ చిత్రం ట్రైలర్‌ని గురువారం చిత్రబృందం విడుదల చేశారు. ఈ సందర్బంగా దిల్‌రాజు మాట్లాడారు. ‘ ఈ సినిమాలో విజయ్ కేరక్టర్‌ని క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చేలా డిజైన్ చేశాడు పరశురామ్. వినోదంతోపాటు యూత్‌ఫుల్ ఎమోషన్స్ కూడా ఆయన పాత్రలో ఉంటాయి. పరశురామ్ మార్క్ సున్నితమైన కామెడీ ఆకట్టుకునేలా వుంటుంది. 21ఏళ్ల క్రితం ఏప్రిల్ 5న నా తొలి సినిమా ‘దిల్’ విడుదలైంది. ఆ సినిమాతో దిల్‌రాజుగా మారాను. ఇప్పుడు 21ఏళ్ల తర్వాత అదే డేట్లో ‘ఫ్యామిలీస్టార్’ వస్తున్నది. మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఒక సూపర్‌హిట్ సినిమాతో థియేటర్స్‌కి వస్తున్నాం’ అంటూ నమ్మకం వ్యక్తం చేశారు దిల్‌రాజు. ఈ సినిమాలోని అన్ని అంశాలూ ప్రేక్షకులకు నచ్చుతాయని, ఈ సినిమాతోపాటు ఇందులోని పాత్రధారులు కూడా కొన్నేళ్లపాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతారని దర్శకుడు పరశురామ్ చెప్పారు.