The Red Bag | సస్పెన్స్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు మరియు బలమైన భావోద్వేగాల కలయికతో తెరకెక్కిన సరికొత్త థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. మెమరీ మేకర్స్ పతాకంపై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. రాధ్య, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉంది అనేది సమీక్షలో చూద్దాం.
కథ
ఓ వైపు అరాచకమైన చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తూ, అమ్మాయిల రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే డాన్ మైక్ (కబీర్ సింగ్) చుట్టూ కథ తిరుగుతుంది. తన లక్ష్య సాధనలో భాగంగా మైక్ చేసే అసాధారణ పనుల మధ్య విన్ని (రాధ్య)తో పాటు మరో ముగ్గురు యువతులు అనుకోకుండా అతడి చెరలో చిక్కుకుంటారు. అసలు ఆ నలుగురు అమ్మాయిలు ఆ చీకటి ఊబిలోకి ఎలా అడుగుపెట్టారు? వారిని కాపాడేందుకు ఆ రెడ్ బ్యాగ్ ఎందుకు కీలకంగా మారింది? మైక్ ఉచ్చు నుంచి ఆ యువతులు ఎలా బయటపడ్డారు అనే ఉత్కంభభరిత అంశాల సమాహారమే ఈ చిత్రం.
విశ్లేషణ & నటీనటుల పనితీరు
దర్శకుడు రవి కుమార్ సీరపు పాత కథాంశాన్నే ఎంచుకున్నప్పటికీ, దానిని నేటి ఆధునిక కోణంలో అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించడంలో సఫలమయ్యారు. ప్రారంభంలో కథ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, అమ్మాయిల గతం తెరపైకి వచ్చాక కథనం వేగవంతం అవుతుంది. ‘బ్యాక్ అండ్ ఫోర్త్’ స్క్రీన్‌ప్లే విధానం ప్రేక్షకులలో ఉత్కంఠను నిలుపుతుంది. నటీనటుల విషయానికి వస్తే, రాధ్యతో పాటు మిగతా ముగ్గురు భామలు గ్లామరస్‌గా కనిపించడమే కాకుండా కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలలో అద్భుతంగా నటించారు. విలన్‌గా కబీర్ సింగ్ తనదైన నటనతో భయపెడితే, ప్రసాద్ బెహరా కామెడీ కాస్త రిలీఫ్ ఇస్తుంది. నటి రాశీ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో బలంగా నిలిచింది. సినిమా ప్రథమార్థం మంచి భావోద్వేగాలను పండిస్తే, ద్వితీయార్థం మాత్రం ఛేజింగ్‌లు, యాక్షన్ సీన్లతో దూసుకుపోతుంది. క్లైమాక్స్‌ను ఎమోషనల్ టచ్‌తో ముగించిన తీరు, సమాజంలో ఒక తల్లి పడే వేదనను మరియు మాతృమూర్తి గొప్పతనాన్ని స్పృశించిన విధానం ప్రేక్షకులను కదిలిస్తుంది.
సాంకేతికంగా
సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కింది. కెమెరా పనితనం విజువల్స్‌ను చాలా రిచ్‌గా చూపించగా, నేపథ్య సంగీతం మరియు పబ్ సాంగ్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. శక్తివంతమైన సంభాషణలు, ఉన్నతమైన నిర్మాణ విలువలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. పైకి ఎంత బోల్డ్‌గా కనిపించినప్పటికీ, లోపల బలమైన ఆశయం, మాతృప్రేమ ఉన్న నలుగురు ఆధునిక వనితల పోరాటమే ఈ ‘ది రెడ్ బ్యాగ్’. మాస్, గ్లామర్ మరియు ఎమోషన్స్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక మంచి సినిమా అనుభూతిని ఇస్తుంది.
చివరిగా..
ఒక రహస్యమైన బ్యాగ్ చుట్టూ తిరిగే కథను ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌ను కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక చక్కటి అనుభూతిని పంచుతుంది.
రేటింగ్: 3