Kalyani Malik | సీన్ సెటర్స్ మరియు అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సంగీత వేడుక “ది నైట్ ఆఫ్ ది స్టార్స్” జూన్ 12న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీ వేదికగా అత్యంత వైభవంగా జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, ప్రముఖ నేపథ్య గాయని గీతా మాధురిలతో పాటు సాకేత్, వినూత్న, కశ్యప్, అదితి, భార్గవి తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను సంగీత ప్రపంచంలో ఓలలాడించనున్నారు.
ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఆర్గనైజ్ చేస్తున్న ఈ వేడుకకు సంబంధించిన మీడియా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిఖిల్ విజయేంద్ర సింహ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఎన్నో మధురమైన జ్ఞాపకాలుగా, నోస్టాల్జిక్ ఫీలింగ్స్‌గా మిగిలిపోయిన పాటలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 23 సంవత్సరాల తర్వాత కళ్యాణి మాలిక్ గారి ఆధ్వర్యంలో ఒక మ్యూజికల్ లైవ్ షో జరగడం చాలా సంతోషంగా ఉందని, ఈ అద్భుతమైన వేదికను అందించిన శ్రీకాంత్ గారికి మరియు కళాకారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌తో పాటు అధికారిక ఫోన్ నంబర్లలో అందుబాటులో ఉన్నాయని, ప్రేక్షకులందరూ తరలివచ్చి జూన్ 12న ఈ సంగీత రాత్రిని ఆస్వాదించాలని కోరారు.
ఈ వేడుకపై సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ‘ఐతే’ విడుదలైనప్పుడు ఎంతటి ఉత్సాహం, ఆనందం కలిగాయో, ఇప్పుడు ఈ షో నిర్వహిస్తున్నప్పుడు కూడా అదే భావన కలుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సింగర్స్ అందరితో కలిసి జూన్ 12న చేయబోయే ఈ మ్యూజికల్ ఈవెంట్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ గాయని గీతా మాధురి మాట్లాడుతూ.. కళ్యాణి మాలిక్ గారు మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ షో గురించి ఇప్పటికే ఎంతో మంది అభిమానుల నుంచి ఆసక్తికరమైన కాల్స్ వస్తున్నాయని తెలిపారు. తనకు లైవ్ మ్యూజిక్ షోలు అంటే ఎంతో ఇష్టమని, అలాంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగం కావడం, అద్భుతమైన అసెంబ్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికపై కళ్యాణి గారి పాటలను పాడబోతుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. ఈ షో టికెట్ల కోసం డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా లేదా సోషల్ మీడియా మరియు నిర్వాహకుల ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో గాయకులు, నిర్వాహకులు మరియు కార్యక్రమానికి సంబంధించిన ఇతర ప్రతినిధులు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.