ఆల్చిప్పను చీల్చుకుని అప్పుడే పుట్టిన ముత్యమంటి వన్నె ఫ్లోర్లెన్త్ టాప్లో మెరిసిపోతున్నది హీరోయిన్ స్టెఫీ పటేల్. డబుల్ లేయర్ తరహాలో డిజైన్ చేసిన ఈ లాంగ్ఫ్రాక్పై జరీతో పాటు ముత్యాలు, చమ్కీలు కలగలిసిన ఎంబ్రాయిడరీ కొత్త అందాన్ని తీసుకొచ్చింది.
దుస్తులకు సరిజోడుగా హాఫ్వైట్ ముత్యాలు, రాళ్లు జోడించిన చాంద్బాలీ చెవిపోగులు ధరించింది స్టెఫీ. వీటికి మ్యాచ్ అయ్యేలా ఎడమచేతికి జోడు ముత్యాలు, జాతిరాళ్లు పొదిగిన ఉంగరం ధరించింది. కుడిచేతికి ఏడు వరుసల తెల్లరాళ్ల అంగుళీకం పెట్టుకుంది. ఇక రేడియం గ్రీన్, పసుపు వర్ణాల నెయిల్ పాలిష్ ట్రెండీ లుక్ను తెచ్చింది. మొత్తంగా తన ఆహార్యానికి నప్పేలా.. తళుక్కున మెరిసే బొట్టుతో, గులాబీ రంగు లిప్స్టిక్తో అలంకారాన్ని పూర్తి చేసుకుందీ ‘చెప్పాలని ఉంది’ సుందరి. సౌందర్యారాధకులు ‘నిన్నుతలచి’ మైమరచిపోవడం ఖాయం.. స్టెఫీ!