‘ది గోట్ లైఫ్’ సినిమా కోసం చాలా అవకాశాలను వదులుకున్నానని, ఓ గొప్ప సినిమా కోసం అలాంటి త్యాగాలు తప్పవని అన్నారు మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన తాజా చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమార్ చెప్పిన సినిమా సంగతులు..
90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రచయిత బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే పుస్తకానికి దృశ్యరూపమే ఈ సినిమా. కేరళలో అనూహ్య పాఠకాదరణ పొందిన ఈ పుస్తకం సినిమా హక్కుల కోసం అగ్ర దర్శక నిర్మాతలు, హీరోలు పోటీపడ్డారు. ఈ కథతో దర్శకుడు బ్లెస్సీ 2008లో నన్ను సంప్రదించాడు. అలా ‘ది గోట్ లైఫ్’తో నా ప్రయాణం మొదలైంది.
2018లో సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాం. తొలుత రాజస్థాన్ ఏడారిలో షూటింగ్ చేయాలనుకున్నాం. అయితే అక్కడ అరబ్ ఏడారుల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్ కోసం 31 కిలోలకుపైగా బరువు తగ్గాల్సి వచ్చింది. అందుకోసం షూటింగ్‌కు ఏడు నెలల విరామం తీసుకున్నా.
షూటింగ్ టైంలో లాక్డౌన్ వచ్చింది. అప్పుడు మేము జోర్డాన్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. వందేభారత్ ఫ్లైట్‌లో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఏడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఎన్నో కష్టాలు పడి అరుదైన లొకేషన్లలో చిత్రీకరణ పూర్తి చేశాం. రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ వల్ల ఆలస్యమైంది
నజీబ్ పాత్రలో సహజత్వం కనిపించేందుకు ప్రయత్నించాను. ఓ రకంగా చెప్పాలంటే ఆయన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాను. ఈ క్యారెక్టర్ కోసం కఠినమైన ఆహార నియమాలు పాటించా. ఈ క్రమంలో నా ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందారు. అయితే సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాలు అర్థం చేసుకొని మద్దతుగా నిలిచారు.
ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాను అందివ్వబోతున్నామనే నమ్మకంతోనే దాదాపు 16 ఏళ్లుగా ఈ సినిమాతో ప్రయాణం చేశాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు వచ్చిన కొన్ని అవకాశాలను వదిలేశాను. ఇలాంటి అరుదైన సినిమాలు చేస్తున్నప్పుడు మిగతా ఆఫర్స్ వదులుకోవడం తప్పుకాదు.
ఈ సినిమాలో ఏడారి జీవితాన్ని సజీవంగా చూపించాం. అందుకోసం మా టీమ్ ప్రతిభావంతంగా పనిచేసింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాం. తెలుగులో నేను సొంతంగా డబ్బింగ్ చెప్పాను. తెలుగు పాటలు, సంభాషణల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.