ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకొని, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ముందుకురాబోతుంది. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ ఈ నెల 21న తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నటుడు రాజా మాట్లాడుతూ ‘ఓ ఫాస్టర్‌గా నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. రాణి మరియా త్యాగం గురించి ఈ సినిమాలో చూపించారు. అన్ని గుణాల్లో క్షమాగుణం చాలా గొప్పది. అదే అంశాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది’ అన్నారు.
ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతుందనే నమ్మకం ఉందని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ.లూర్దూ రాజ్ అన్నారు. సమాజంలో ప్రేమ, శాంతి, క్షమాపణ గురించి తెలియజేసే చిత్రమిదని తెలంగాణ క్రిష్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్‌జాన్ పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసిన కాథలిక్ మత సోదరి, సామాజిక కార్యకర్త సీనియర్ రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.