కథానాయిక సంయుక్త మీనన్ తొలిసారి మహిళా ప్రధాన కథాంశంలో నటిస్తున్నది. ఆమె ప్రధాన పాత్రలో హాస్య మూవీస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తున్నారు. సంయుక్తమీనన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్‌నివ్వగా అగ్ర నిర్మాత దిల్‌రాజు కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సింగిల్ సిట్టింగ్‌లో సంయుక్తమీనన్ ఈ కథ ఓకే చేసింది. అంతలా ఆమెకు ఈ స్టోరీ నచ్చింది’ అన్నారు. ‘ఇలాంటి స్క్రిప్ట్ దొరకడం నా అదృష్టం. ఈ సినిమాకు ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనే ముద్ర వేయలేం. బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. సామాజిక, రాజకీయ అంశాల ప్రస్తావన కూడా ఉంటుంది. కండబలం అవసరం లేకుండానే స్త్రీ తనదైన రీతిలో దుష్టశిక్షణ చేసే మార్గం ఉంది. ఈ కథ అదే విషయాన్ని చర్చిస్తుంది’ అని సంయుక్తమీనన్ చెప్పింది. తమ సంస్థ నిర్మిస్తున్న ఆరో చిత్రమిదని, యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుందని నిర్మాత రాజేష్ దండా తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణం: హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, సమర్పణ: సంయుక్త మీనన్, రచన-దర్శకత్వం: యోగేష్ కేఎంసీ.