తెలంగాణ-మహరాష్ట్ర సరిహద్దుల్లోని బొగ్గు గనుల నేపథ్య కథాంశంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న హీరోయిన్ సెంట్రిక్ పానిండియా యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’. సంయుక్త మీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యోగేష్ కేఎంసీ దర్శకుడు. మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. భారీ ఇండస్ట్రీయల్ మెషీన్స్ ముందు సన్ గ్లాసెస్ పెట్టుకొని, చేతిలో గన్తో ైస్టెలిష్గా నిలబడ్డ సంయుక్త మీనన్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆమె పోషిస్తున్న పోలీస్ ఆఫీసర్ పాత్రలోని దూకుడుని ఈ స్టిల్ ప్రజెంట్ చేస్తున్నది.
దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల నేపథ్యంలో, నిజజీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నామని, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పానిండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. మురళీశర్మ, రావురమేశ్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎ.వసంత్, సంగీతం: సామ్ పీఎస్.