రివ్యూ – థాంక్యూ
నటీనటులు – నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, ప్రకాష్ రాజ్, సంపత్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి తదితరులు
సాంకేతిక నిపుణులు- ఎడిటింగ్ – నవీన్ నూలి, సంగీతం – థమన్, కథ – బీవీఎస్ రవి, నిర్మాణం – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాతలు – దిల్ రాజు, శిరీష్, స్క్రీన్ ప్లే దర్శకత్వం – విక్రమ్ కె కుమార్
చేసిన సాయాన్ని, చేదోడుగా నిలిచిన మనుషుల్ని మర్చిపోవద్దు, వాళ్లకు కృతజ్ఞతగా ఉండాలని చెప్పే కథాంశంతో తెరకెక్కిన సినిమా థాంక్యూ. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మాన్సూన్ సీజన్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కిందా లేదా, సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో రివ్యూలో చూద్దాం
కథగా చూస్తే:
ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన కుర్రాడు అభిరామ్ (నాగ చైతన్య). అక్కడ రావు అంకుల్ (ప్రకాష్ రాజ్), ప్రియ (రాశీ ఖన్నా) అభిరామ్ కు అండగా నిలుస్తారు. వైద్య అనే యాప్ తయారు చేసి అభిరామ్ వ్యాపారవేత్తగా పేరు, డబ్బు గడిస్తాడు. ఈ క్రమంలో ప్రియతో ప్రేమలో పడతాడు. వీళ్లు సహజీవనం సాగిస్తుంటారు. తను అనుకున్నది సాధించాక, తనొక్కడి వల్లే ఇదంతా సాధ్యమైందనే భ్రమలో పడిపోతాడు అభిరామ్. టీమ్ వర్క్ కు విలువ ఇవ్వడు, గుడ్డిగా లక్ష్యం వైపు సాగుతుంటాడు. ఎదిగాక అభిలో వచ్చిన మార్పు ప్రియ తట్టుకోలేకపోతుంది. అభిరామ్ గొప్ప స్థాయికి వచ్చేందుకు సాయపడిన వాళ్లను గుర్తు చేస్తుంది. దీంతో అంతర్మథనంలో పడిపోతాడు అభి. తన మూలాలను, తను నడిచొచ్చిన దారిని వెతుక్కుంటూ సొంతూరు వస్తాడు. అతని గతమేంటి, ఆ గతంలో పార్వతీ (మాళవికా నాయర్)తో ప్రేమ, శర్వా (సాయి సుశాంత్ రెడ్డి)తో వైరం ఎలాంటి ముగింపునకు చేరాయి అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్:
ఫీల్ గుడ్ కథ
నాగ చైతన్య నటన
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
కమర్షియల్ అంశాలు లోపించడం
కొంత సాగతీత సీన్స్
ఎలా ఉందంటే:
అభిరామ్ అనే వ్యక్తి లైఫ్ జర్నీ ఈ సినిమా. వ్యాపారవేత్తగా అతను ఎదిగిన క్రమం, తను కోరుకున్న స్థాయికి వచ్చాక, కేవలం వ్యాపారాత్మక ధోరణిలో సాగే అతని ఆలోచనలు అభిరామ్ క్యారెక్టర్ కు నెగిటివ్ షేడ్స్ తీసుకొస్తాయి. అయితే అతనిలో మంచి మిగిలే ఉంటుంది. ప్రియ గుర్తుచేశాక అంతర్మథనంలో పడి, మనుషుల్ని ప్రేమించడం, తనకు సాయం చేసిన వారికి కృతజ్ఞతగా ఉండటం ప్రారంభిస్తాడు. సినిమా వేగంగా మొదలై, అభిరామ్ కెరీర్, ప్రేమ, సహజీవనం..ఇలా చకచకా సాగుతుంది. ఇదంతా ఫీల్ గుడ్ అనుభూతిని పంచుతుంది. విజయాల తరహాను, స్థాయిని వదిలేస్తే మనలో ఎవరైనా తమ జీవితంతో ఈ కథను పోల్చుకోవచ్చు. ఇప్పుడు మనం చేరిన ఈ గమ్యానికి సాయపడిన వారెందరో ఉంటారు. వాళ్లను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి, థాంక్స్ చెప్పాలి అనే పాయింట్ బాగుంది. అభిరామ్ మూలాలు వెతుక్కుంటూ చేసిన ప్రయాణాన్ని దర్శకుడు విక్రమ్ కె కుమార్ తనదైన శైలిలో ఆహ్లాదకరంగా తెరకెక్కించాడు. అభిరామ్ పాత్రలో నాగ చైతన్య నటన మెప్పిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో టీనేజ్ కుర్రాడిలా ఆకట్టుకున్నాడు. ఈ గెటప్ లో చైతూ సహజంగా కనిపించాడు. అలాగే కాలేజ్ సీన్స్ లో, హాకీ ప్లేయర్ గా అతని బాడీ లాంగ్వేజ్ ప్రేమమ్ ను గుర్తు చేస్తుంది. ప్రియ క్యారెక్టర్ కు రాశీఖన్నా న్యాయం చేసింది. ఆమె పాత్రలోని భావోద్వేగాలు పండాయి. పార్వతీ పాత్రలో మాళవికా మరో కీ రోల్ చేసింది. ప్లాష్ బ్యాక్ లో ఆమె క్యారెక్టర్ నాగచైతన్యతో పాటు లీడ్ చేస్తుంది. నిడివి తక్కువైనా ప్రకాష్ రాజ్ పాత్ర బరువైంది. కథలో కీలకమైంది. ఈశ్వరీరావు, సంపత్, సాయి సుశాంత్ క్యారెక్టర్స్ బాగున్నాయి. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణ. యూఎస్ ను అందంగా చూపించిన ఆయన ఫ్రేమ్స్, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో పల్లెటూరి వాతావరణాన్ని మరింత కలర్ ఫుల్ గా తెరకెక్కించారు. థమన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ మేకింగ్ వ్యాల్యూస్ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మరికొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి ఉంటే సినిమా ఫలితం ఇంకా బాగుండేది.
రేటింగ్ : 2.75/5
చివరగా.. థాంక్యూ – ఫీల్ గుడ్ మూవీ