Thani Oruvan-2 Movie | వాల్తేరు వీరయ్య దర్శకుడు మోహన్ రాజా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ తని ఒరువన్. స్వయంగా ఆయన తమ్ముడు జయం రవిని హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా తమిళనాట సంచలన రికార్డులు కొల్లగొట్టింది. జయం రవిని వంద కోట్ల హీరోగా చేసింది. ఇదే సినిమాను రామ్‌చరణ్ ధృవగా రీమేక్ చేసి ఇక్కడ బంపర్ హిట్ కొట్టాడు. కాగా ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. సోమవారంతో తని ఒరువన్ 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఈ సినిమా సీక్వెల్ అనౌన్స్‌మెంట్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ గ్లింప్స్‌ను కూడా వదిలారు.
తొలిపార్టులో హీరో.. సిద్దార్థ్ అభిమన్యను విలన్‌గా ఎంచుకుని, ఆయన ఏర్పరుచుకున్న సమ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సైతం పెకిలించి వేశాడు. అయితే సీక్వెల్లో మాత్రం హీరో విలన్‌ను వెతకడం కాదు. విలనే హీరోని వెతుక్కుంటూ వస్తాడని చెప్పిన పాయింట్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. తని ఒరువన్లో ‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే, నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే, నీ సామర్థ్యం తెలుస్తుంది’ అని హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిస్ చేయగా సీక్వెల్లో ‘నీ లోని నిజాన్ని నాకు చూపించు. నీ శత్రువు ఎవరో నేను చెబుతాను’ అంటూ ఈ సినిమా థీమ్‌ను ఒక్క డైలాగ్‌తో కన్వయి చేశారు.
ఇక తని ఒరువన్లో శుత్రువుగా అరవింద్ స్వామి నటన ఊహాతీతం. అసలు విలన్ రోల్లో అరవింద్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడు సబబు. నిజానికి ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ పార్టు అరవింద్ స్వామి పోషించాడనడంలో సందేహమే లేదు. స్క్రీన్‌పై అరవింద్ స్వామి కనిపించిన ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్‌పై కూర్చొబెట్టింది. అలాంటి అరవింద్‌ను రీప్లేస్ చేయడం అనితర సాధ్యమని ధృవలో సైతం విలన్‌గా అరవింద్ స్వామినే పెట్టారు. అలాంటిది ఇప్పుడు సీక్వెల్లో ఆ రేంజ్లో విలన్‌గా ఎవరు మెప్పిస్తారనేది మిలయన్ డాలర్ల ప్రశ్న.
తొలి పార్టును నిర్మించిన ఏజీఎస్ సంస్థే సీక్వెల్‌ను కూడా నిర్మిస్తుంది. నయనతార హీరోయిన్గా నటిస్తుంది. తని ఒరువన్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించిన సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ సీక్వెల్‌కు కూడా మ్యూజిక్ ఇస్తాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.