Thandel | నాగ్ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం తండేల్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కలయికలో వచ్చిన ‘తండేల్’చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించగా, ఈ మూవీకి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ చిత్రం రూ.106 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ వసూల్ చేసిందని తండేల్ నిర్మాతలు ప్రకటించారు. రూ.70 కోట్లతో ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. గీతా ఆర్ట్స్ అధినేత, టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పించిన సంగతి తెలిసిందే. లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించగా, అటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 29న, 2025న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయింది. ఈ మేరకు సదరు సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ తమ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.ఈ క్రమంలో చైతన్య, సాయి పల్లవి జంట రెండు తెలుగు రాష్ట్రాల టీవీ ఛానళ్లలో సందడి చేయనున్నారు. ఆదివారం రోజు ఈ జంట ప్రేక్షకులకి మంచి వినోదం పంచనున్నారు.
తండేల్ సినిమాలో మ్యూజిక్‌తో పాటు చైతన్య, సాయి పల్లవి నటనకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. మొత్తమ్మీద ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా, బలమైన ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ తో సాగుతూ బాగా ఆకట్టుకుంది. డీసెంట్ టేకింగ్ సినిమా స్థాయిని పెంచాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. సంగీతం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. తండేల్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చైతన్య తన తర్వాతి సినిమాను కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. చైతూ కెరీర్లో 24(NC24)వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వృష కర్మ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.