హీరో ఎవరైతే నాకేంటి.. గూస్బంప్స్ తెప్పించే మ్యూజిక్‌తో అదరగొట్టడమే నా పని.. అంటూ సినిమా సినిమాకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు ఎస్ థమన్ (S Thaman). సినిమాకు కథ ఒక ఎత్తు అయితే.. ఆ కథను సమర్థవంతంగా నడిపించడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలి. కథకు సరిపోయే విధంగా మ్యూజిక్ అందిస్తూ సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు ఎస్ థమన్.
ఈ స్టార్ మ్యూజిక్ కంపోజర్ ప్రస్తుతం ఆర్సీ 15, ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) ప్రాజెక్ట్‌లకు పనిచేస్తున్నాడు. కాగా మహేశ్‌బాబుతో థమన్ చేస్తున్న నాలుగో సినిమా ఎస్ఎస్ఎంబీ 28. దూకుడు, ఆగడు, సర్కారు వారి పాట తర్వాత ఎస్ఎస్ఎంబీ 28 చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాతో తన కల నెరవేరిందంటున్నాడు థమన్.
ఎస్ఎస్ఎంబీ 28కు పనిచేయడం నాకున్న అతిపెద్ద కల.. ఆ కల నెరవేరుతున్న క్షణం ఇది. మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే ప్రాజెక్ట్‌లో నేను ఎంతకాలం నుంచి పనిచేయాలనుకుంటున్నానో చెప్పలేను. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు నా ఫేవరేట్ చిత్రాల్లో ఒకటి. మహశ్ బాబు సినిమా కోసం పూర్తిస్థాయిలో అవుట్ పుట్ ఇస్తానని, ఈ సినిమా కోసం నా వర్క్ ఆకాశమే హద్దులా ఉండబోతుందని చెప్పాడు థమన్.