‘మా సంస్థకు గత ఏడాది అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మిరాయ్’ అపూర్వ విజయం మరెన్నో సినిమాలు చేసే శక్తినిచ్చింది. ఈ సినిమాతో మేము ప్రేక్షకుల విశ్వసనీయతను పొందాం. అది మాకు చాలా ఆనందాన్నిస్తున్నది’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. స్వీయ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన తెరకెక్కించిన ‘మిరాయ్’ చిత్రం ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బ్లాక్బస్టర్ థాంక్స్ మీట్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. ఇంకా చెబుతూ..‘దర్శకుడు కార్తీక్ ఈ కథ చెప్పినప్పుడే మంచి కమిట్మెంట్ ఉన్న హీరో తేజతో ఈ సినిమా చేయాలనుకున్నాం. దర్శకుడు కార్తీక్, తేజ, మనోజ్.. అందరూ అద్భుతమైన ఎఫర్ట్స్ పెట్టారు. మా అమ్మాయి కృతిప్రసాద్ ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మాకు లక్కీ ఛార్మ్ అని భావిస్తున్నా’ అన్నారు.
‘మిరాయ్’ చిత్రాన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారని, దర్శకుడు కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్గారి ఎమోషనల్ సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందని హీరో తేజ సజ్జా తెలిపారు. 12 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సక్సెస్ వల్ల తన ఫోన్ మోగుతూనే ఉందని, ఈ కథలో తనను భాగం చేసిన దర్శకుడు కార్తీక్కు రుణపడి ఉంటానని, ఈ సినిమా తన కుటుంబాన్ని నిలబెట్టిందని మంచు మనోజ్ భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.