Telugu Youtuber Harsha Sai | లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు యూట్యూబర్ హర్షసాయి ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చాడు. తనపై వస్తున్న ఆరోపణలు అబద్దం అని వెల్లడించాడు. కొందరు కావాలనే నా మీదా అసత్య ప్రచారం చేశారు అంటూ హర్షసాయి చెప్పుకోచ్చాడు.
యూట్యూబర్ హర్షసాయి తనను లైంగికంగా దాడి చేయడంతో పాటు మానసికంగా వేధిస్తున్నట్లు ఓ యువతి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని.. పేదలకు సేవ చేస్తున్నానంటూ యూట్యూబ్లో రీల్స్ చేస్తున్న హర్ష సాయి అనేక అరాచకాలకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాకుండా తనను ప్రేమతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి పలుమార్లు శారీరకంగా వాడుకుని, ఇప్పు డు తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకునేందుకంటూ తన నుంచి రూ.2 కోట్ల నగదు తీసుకున్నాడని, ఇందుకు ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా కారణమని పేర్కొన్నది. అయితే దీనిపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు హర్షసాయికి నోటీసులు పంపారు. అయితే హర్షసాయి పోలీసులకు దొరకకుండా తప్పించికుని తిరుగుతూ దేశం వదిలి వెళ్లినట్లు సమాచారం.
అయితే చాలా రోజులుగా విదేశాల్లోనే ఉన్న హర్షసాయి తాజాగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. తనపై నమోదైన కేసుకు సంబంధించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారు. నేను తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్తో పాటు రూ. 2 కోట్లు ఇవ్వాలని అడిగారు. నేను ప్రజలకు అయితే ఇస్తాను కానీ ఇలా బ్లాక్ మెయిల్ చేసేవారికి అసలే ఇవ్వను. నిజాలు బయటకొచ్చాయి కాబట్టే నాకు బెయిల్ వచ్చింది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు.. అదే జరిగింది అంటూ హర్షసాయి వెల్లడించాడు.