సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తామని ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటవ తేదీ నుంచి అన్ని షూటింగ్స్ ఆపేశారు. మూడు దఫాలుగా ఇండస్ట్రీలోని అన్ని విభాగాలతో నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ సభ్యులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో దాదాపు అన్ని సమస్యలపై అంగీకారం కుదిరిందని మంగళవారం జరిపిన ప్రెస్మీట్లో వెల్లడించారు.
దిల్ రాజు మాట్లాడుతూ…‘ మా సంస్థతో పాటు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, ఎన్వీ ప్రసాద్ వాళ్లకు స్క్రీన్స్ ఉన్నాయి. వీటిలో క్యూబ్, యూఎఫ్వో వంటి వీపీఎఫ్ ఛార్జీలు మేమే భరించాలని నిర్ణయించాం. మా దారిలో మిగతా ఎగ్జిబిటర్స్ వస్తారని ఆశిస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటు ఫెడరేషన్తోనూ అగ్రిమెంట్స్ చేసుకున్నాం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతాయి. ఈలోగా అత్యవసర షూటింగ్ చేసుకునేవారు ఛాంబర్ పర్మిషన్తో గురువారం నుంచి చిత్రీకరణలు జరుపుకోవచ్చు. థియేటర్లో టికెట్ రేట్ల్లు మిగతా అన్ని చిత్రాలకు ఒకలా, భారీ సినిమాలకు మరోలా స్లాబ్ నిర్ణయించుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలతో కొందరికి తాత్కాలిక ఇబ్బంది కలగవచ్చు. కానీ దీర్ఘకాలంలో మంచి జరుగుతుందని నమ్ముతున్నాం’ అని అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు సి. కళ్యాణ్, , వై. రవిశంకర్, వివేక్ కూచిభొట్ల, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.